బాబును జగన్ అలా దెబ్బేస్తారట

Update: 2016-10-03 10:06 GMT
రాజకీయాలు చాలా చిత్రమైనవి. తిరుగులేని నాయకుడిగా వెలిగిపోయే వారు.. రోజు వ్యవధిలో హీరో నుంచి జీరోకి పడిపోతుంటారు. ఒక్క చిన్న తప్పుతో భారీ మూల్యం చెల్లించుకున్న రాజకీయ అధినేతలు చాలామందే. అవకాశాలు వెతుక్కుంటూ రావటం ఒక పద్ధతి అయితే.. అవకాశాలకు ఎదురెళ్లి మరీ అందిపుచ్చుకోవటం మరో పద్ధతి. తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుచూస్తే రెండో పద్ధతిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకహోదా అంశంపై దూకుడును పెంచిన ఆయన సమర్థంగా తన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏదో మాటలతో చెప్పి వదిలేయటం కాకుండా.. అందుకు తగిన ఆధారాల్ని క్లిప్పింగ్ ల రూపంలో ప్రదర్శించటం ఏపీ ముఖ్యమంత్రికి చిరాకు తెప్పించేదే. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ.. ఏపీ సర్కారు ఎన్ని కుప్పిగంతలు వేసింది.. ఏపీ ప్రజల్ని ఎంతగా మభ్య పెట్టిందన్న విషయాన్ని తన వాదనలతో.. వరుస నిరసనలతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రత్యేక హోదాపై బీజేపీ.. టీడీపీ ఇచ్చిన హామీలతో పాటు.. హోదాతో ఏపీకి కలిగే ప్రయోజనాల్ని ఆయన సుదీర్ఘంగా వివరిస్తున్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని.. అంతకు మించి అన్నట్లుగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ గురించి ఏపీ సర్కారు.. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తన మాటలతో జగన్ తిప్పి కొడుతున్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై కేంద్రమంత్రి వెంకయ్య చేస్తున్న వ్యాఖ్యలకు రిటార్ట్ ఇవ్వటమే కాదు.. గణాంకాల సాయంతో వారు చెబుతున్న దాన్లో నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చేసిన తప్పులే తన ఆయుధాలుగా మలుచుకుంటున్న జగన్.. క్రమపద్ధతిలో తన నిరసనల్ని నిర్వహించటం చూసినప్పుడు హోదా విషయం మీద ఆయన ఎంత కమిట్ మెంట్ తో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. ఏపీకి హోదా ప్రకటించకున్నా.. బీజేపీతో ఏపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి.. ఏపీకి పెద్దగా ప్రయోజనం చేకూర్చని ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అదేదో అద్భుతం అన్నట్లుగా ఏపీ సర్కారు చెబుతున్న మాటల్ని తిప్పి కొడుతూ జగన్ చేస్తున్న విమర్శలు ఆకట్టుకునేలా ఉండటంతో పాటు.. తన వాదనకు సాక్ష్యంగా గణాంకాల్ని.. గత క్లిప్పింగ్ లను ప్రదర్శిస్తున్న వైనం పలువురి దృష్టికి ఆకట్టుకుంటోంది. బాబు చెప్పిన మాటల్నే ఆధారంగా చేసుకొని ఆయన్ను దెబ్బ తీయాలన్నదే జగన్ తాజా వ్యూహంగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News