ప్రతిపక్షం గొంతునొక్కే విధంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులమైన తమకు సభలో అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల హామీలు, ప్రభుత్వం చేస్తున్నచర్యల గురించి వాస్తవాలు మాట్లాడితే అధికారపక్షం భయపడుతోందని, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాల్లో మీరు మాట్లాడవద్దు అంటూ స్పీకర్ డిక్టం పాస్ చేయడం ఏనాడు చూడలేదని జగన్ వ్యాఖ్యానించారు. పదేపదే తమ మైక్‌ను కట్ చేస్తున్నారని చెప్పారు. ప్రజల తరఫున ప్రతిపక్షం మాట్లాడుతుంటే కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనూ చర్చను దాటవేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చర్చ జరగకుండా కుట్ర చేస్తోందని, ఆ కుట్రలో స్పీకర్ భాగస్వామ్యులు అవుతున్నారని ఆరోపించారు.
బడ్జట్‌పై 4 రోజుల చర్చ అన్నారని దాన్ని ఒక్కరోజుకే తగ్గించారని చెప్పారు. 41 రోజుల జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను 17రోజులకే కుధించారని పేర్కొన్నారు. ఏం మాట్లాడాలో స్పీకర్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు ,అధికారపక్షం , స్పీకర్ కుమ్మక్కై దారుణంగా సభను నడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరూ కలిసిరావాలని కోరారు.