మా బలం 67 మంది ఎమ్మెల్యేలా?

Update: 2016-04-01 03:52 GMT
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుపై ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుసరించిన వైఖరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగియటానికి ముందు అసెంబ్లీలో పార్టీల బలాబలాల్ని వెల్లడిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ బలం 67 మంది ఎమ్మెల్యేలుగా చెప్పారని.. ఇంతకంటే అన్యాయమైన పని ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నించారు.

పార్టీ సభ్యురాలు రోజాను సస్పెన్షన్ చేశారని.. పది మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువాలు కప్పుకొని.. అధికారపక్షం వైపు కూర్చున్నా.. వారిని తమ ఎమ్మెల్యేలుగా చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.  తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన భూమా నాగిరెడ్డి అధికారపక్షం బెంచీల్లో కూర్చునే పీఏసీ నివేదికను ప్రవేశ పెట్టారని.. ఇదంతా స్పీకర్ కళ్ల ముందు జరిగినా.. తమ బలాన్ని 67 మంది ఎమ్మెల్యేలుగా చెప్పటం ఏమిటని జగన్ వ్యాఖ్యానించారు.

తమ నుంచి వెళ్లిపోయిన మరో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టీడీపీ బెంచీల్లో కూర్చొని ఉండగానే.. అతనికి మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కల్పించారని.. తమ పార్టీ నుంచి ఫిరాయించిన పది మంది సభ్యులు సభలో కూర్చొని ఉన్నా.. తమ బలాన్ని స్పీకర్ 67గా చెప్పటం ఏమిటని.. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? అంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అమ్ముడుబోయిన ఎమ్మెల్యేల్నికాపాడేందుకు స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేగా మారిపోయారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అనుసరించిన వైఖరిని జగన్ తీవ్రస్థాయిలో తప్పు పట్టారని చెప్పొచ్చు.
Tags:    

Similar News