తమ్ముళ్ల బరితెగింపుపై కమిటీ వేసిన జగన్

Update: 2019-04-14 11:11 GMT
నాలుగు రోజుల క్రితం (ఏప్రిల్ 11న) ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం తెలిసిందే. అధికార.. విపక్ష నేతల మధ్య.. కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న దాడులపై తాజాగా జగన్ స్పందించారు. గుంటూరు జిల్లాలోని గురజాల.. సత్తెనపల్లి.. నరసరావుపేట.. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ శ్రేణులు పాల్పడిన దాడులపై పార్టీ స్పందించింది.

తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చేసిన ఆరాచకాలు.. దౌర్జన్యాలపై తాజాగా కమిటీ ఒక నిజనిర్దారణ కమిటీ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఈ కమిటీ.. అక్కడేం జరిగింది?  అలాంటి పరిణామాలు చోటు చేసుకోవటానికి గల కారణాలు తెలుసుకోవటంతో పాటు.. దాడుల్లో గాయపడిన పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించేలా భరోసా ఇవ్వనున్నారు.

జగన్ ఏర్పాటు చేసిన ఈ కమిటీకి మర్రి రాజశేఖర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీలో శ్రీ కష్ణదేవరాయలు - అంబటి రాంబాబు - కాసు మహేశ్ - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి - జంగా కృష్ణమూర్తి - మహమ్మద్‌ ఇక్బాల్ - ముస్తఫా - అంజాద్‌ భాషా - నవాజ్‌ సభ్యులుగా ఉన్నారు.

మరోవైపు ఇదే అంశంపై వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - బొత్స సత్యనారాయణ - అంబటి రాంబాబు ఈ రోజు రాత్రి 7 గంటలకు గుంటూరు ఎస్పీని కలిసి టీడీపీ వర్గీయుల దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే తమపై దాడులకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు పలువురు ఫిర్యాదు చేయటం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం.. కేసులు నమోదు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News