జగన్ 1.26 లక్షల ఉద్యోగాలిస్తే కేసీఆర్ 50 వేల ఉద్యోగాలు తీసేశారు

Update: 2019-10-07 08:23 GMT
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల వ్యవధిలో రెండు అత్యంత కీలకమైన పరిణామాలు, అవికూడా పరస్పర విరుద్ధమైనవి జరిగాయి. మొదటిది ఏపీలో సీఎం జగన్మోహనరెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా ఒకేసారి 1.26 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. అక్కడికి నాలుగైదు రోజుల్లోనే పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కేసీఆర్ ప్రభుత్వం మాటను లెక్కచేయకుండా సమ్మెకు దిగిన సుమారు 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించారు.

వారికి అక్టోబరు 5 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చి ఆలోగా విధులకు హాజరుకాకుంటే తొలగిస్తామని హెచ్చరించారు. ఎవరూ హాజరుకాకపోవడంతో వారంతా ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని, వారి ఉద్యోగాలు పోయినట్లేనని కేసీఆర్ ప్రకటించారు. వారం రోజుల్లోనే ఈ రెండు పరిణామాలూ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయమయ్యాయి.

ఏపీలో  గ్రామీణ ప్రజలకు 500 రకాల ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటులో భాగంగా భారీస్థాయిలో ఉద్యోగాల నియామకాలను చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు కల్పించడం రికార్డే. దసరా పండుగకు వారం రోజుల ముందు ఏకంగా లక్షా 26 వేల 728 ఉద్యోగాలిచ్చి జగన్ ఆ ఇళ్లలో పండుగ తెచ్చారు.

ఇక తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఎన్నిసార్లు యాజమాన్యానికి, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగారు. పొరుగునే ఏపీలో సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణలోనూ అలాగే చేయాలన్నది వారి డిమాండ్. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు ససేమిరా అన్నారు. ఒకప్పుడు ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్న కేసీఆర్ ఇప్పుడు వారిపై కఠినంగా వ్యవహరించారు. వద్దన్నా సమ్మె చేస్తారా అంటూ ఆగ్రహించి ఏకంగా వారిపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.
Tags:    

Similar News