ఏపీ బంద్‌ కు పిలుపునిచ్చిన జ‌గ‌న్‌

Update: 2018-07-21 07:29 GMT
ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా ఉద్య‌మించి..నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చేప‌ట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు అనుస‌రించిన తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా.. రాష్ట్ర స‌మ‌స్య‌ల్ని పట్టించుకోకుండా త‌మ ఎజెండాకు త‌గ్గ‌ట్లుగా ప్ర‌సంగాలు చేయ‌టాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

అవిశ్వాసంపై ప్ర‌ధాని మోడీతోపాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ.. టీడీపీ ఎంపీలు అనుస‌రించిన వైఖ‌రికి నిర‌స‌న‌గా మంగ‌ళ‌వారం (జులై 24న‌) ఏపీ బంద్‌ న‌కు పిలుపునిచ్చారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిర‌స‌న‌గా బంద్ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అన్ని పార్టీలు.. ప్ర‌జా సంఘాలు.. ప్ర‌జ‌లు.. స్వ‌చ్ఛందంగా ఈ నిర‌స‌న‌లో పాల్గొనాల‌ని కోరారు. ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌ని ప్యాకేజీని అంగీక‌రించి రాష్ట్ర హ‌క్కును బాబు తాక‌ట్టు పెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు. హోదా ఏపీ హ‌క్కు అని.. దాన్ని తాక‌ట్టు పెట్ట‌టానికి సీఎం చంద్ర‌బాబు ఎవ‌రంటూ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల్ని జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. అందులోని ముఖ్యాంశాల్ని చూస్తే..

+ పార్లమెంట్‌ లో చర్చ సందర్భంగా జరిగిన తీరును.. మన రాష్టం మీద పెద్దలకు ఉన్న ప్రేమను చూసి నిజంగా బాధ వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్‌ పార్టీ దాకా.. మిగిలిన ఏ పార్టీలు చూసినా కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తూ మాట్లాడిన మాటలు ఒక్కరి నోటా రాలేదు.

+ అన్నింటికన్నా బాధాకరమైన విషయం ఏమంటే.. పార్లమెంట్‌ సాక్ష్యంగా ఆదుకుంటామని చెప్పి అప్పటి అధికార పక్షం - ప్రతిపక్షం - అన్ని పార్టీలు - చంద్రబాబుతో సహా కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు.

+ విభ‌జ‌న నాటి హామీలు నెరవేర్చకపోగా.. నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు చూస్తే ఇస్తామని కానీ, ఇవ్వాల్సిన బాధ్యత మాది అనే మాట కూడా రాలేదు.

+ తిరుపతిలో ఎన్నికల వేళ తానే ప్రత్యేక హోదాను 10 ఏళ్లు ఇస్తానని చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకు రాలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాలేదు.

+ ఒకవైపు ప్రధానమంత్రికి గుర్తుకురాకపోగా.. ఆయన చెప్పిన మాటల్లో బాధ కలిగించిన విషయం.. చంద్రబాబు అంగీకారంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని చెప్పడం.. ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు?

+  రాష్ట్ర యువత ఉద్యోగాలు లేక వలసబాట పడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. టాక్స్‌ మినహాయింపు - జీఎస్టీలు కట్టాల్సిన పని ఉండదు. హోదాతో కంపెనీలు ముందుకువస్తాయి. కానీ ఇంతటి కీలకమైన విషయంలో రాజీపడటానికి చంద్రబాబు ఎవరు? ఏపీ ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వం - చంద్రబాబులకు ఎవరిచ్చారు?

+ మోదీ మాట్లాడిన మాటలు బాధ కలిగిస్తే.. రాహుల్‌ గాంధీ ప్రసంగంలో కూడా అర నిమిషం కూడా ఏపీ గురించి మాట్లాడ‌లేదు. ఆ అర నిమిషంలో ప్రత్యేక హోదా ఇచ్చే ధర్మం తమపై ఉంది. ఇవ్వాలని అనే మాటలు కూడా ఆయన నోటి నుంచి రాలేదు.

+ గల్లా జయదేవ్‌ ప్రసంగంలో మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్నవి కాదా? ప్రత్యేక హోదా గురించి మేం మాట్లాడిన మాటలు అసెంబ్లీలో చూడండి. రికార్డ్స్‌ తిరిగేయండి. యువభేరిల్లో చూడండి.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూడండి. నిరాహార దీక్షలు సందర్భంగా.. మేం మాట్లాడిన మాటలు.. గత నాలుగన్నరేళ్లుగా చెప్పిన మాటలే గల్లా జయదేవ్‌ తన ప్రసంగంలో చెప్పారు.

+ అప్పుడు మేం ఈ మాటలు చెబితే.. మమ్మల్ని వెక్కింరించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని - కోడలు మగపిల్లాడు కంటానంటే అత్త వద్దంటుందా? అదేమన్నా సంజీవని అంటూ చంద్రబాబు దారుణంగా మాట్లాడారు 

+ సెప్టెంబర్‌ 7 - 2016న - అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్యాకేజీ అని చెప్పి చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేసినపుడు బాబు మంత్రులు కేంద్ర ‍ప్రభుత్వంలో లేరా? ఆ తర్వాత బాబుతో చర్చించి ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు వారు చెప్పడం.. దానికి బాబు కృతజ్ఞతలు తెలుపడం నిజం కాదా?

+ 2017 జనవరి 26న ప్రెస్‌ మీట్‌ పెట్టి బీజీపీ ప్రభుత్వాన్ని విపరీతంగా పొగడటం.. నిజం కాదా? అంటూ  ఈనాడు పత్రికను చూపించారు. 2017 జనవరి 27 మనమే ఎక్కువ సాధించాం.. ఏ రాష్ట్రానికి ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా చెప్పాలని ప్రతిపక్షలకు సవాల్ విసురుతున్నా.. అని చంద్రబాబు చెప్పలేదా?

+ ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి దేశం మొత్తం తెలియజేసేందుకు బడ్జెట్‌ సమావేశాల చివరిరోజున మా ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేశారు. చంద్రబాబు కూడా త‌న ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే దేశం మొత్తం మనవైపు చూసి ఉండేది. ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించకపోవడం ధర్మమేనా?

+ ఒకవైపు చంద్రబాబు బీజేపీతో యుద్ధం అంటారు. మరోవైపు ఆయన ప్రవర్తన అసలు బీజేపీతో యుద్దం చేస్తున్నాడా? అని సామాన్యుడికి కూడా సందేహం కలిగేలా ఉంటుంది.

+ టీటీడీ బోర్డు మెంబర్‌గా బీజేపీకి చెందిన నేత భార్యను నియమించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ సందర్భంగా వెంకయ్యనాయుడు కనిపించారు. పరకాల ప్రభాకర్‌ చంద్రబాబు కొలువులో ఉంటారు. అక్కడేమో ఆయన భార్య నిర్మలా సీతారామన్‌ కేంద్ర మంత్రిగా ఉంటారు. నిన్నటి చర్చలో రాజ్‌ నాథ్‌ సింగ్‌.. మా బంధం విడిపోదు’ అని చెప్పారు.

+ ఓవైపు యుద్ధం అంటూ.. మరోవైపు చంద్రబాబు తనకు లోపాయికారి పనులు చేస్తున్నారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి.. ప్రత్యేక హోదాకు చంద్రబాబు తూట్లు పొడిచారు.  ఎన్నికలకు ఆరునెలల ముందు ఇప్పుడు విడాకులు తీసుకొని.. అది కూడా నిజాయితీగా చేయడం లేదు.

+ మేం అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీతో ఉన్న పరిచయాల వల్ల అది చర్చకు రాకుండా చంద్రబాబు చేశారు. ఇప్పుడు అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించండి. రాజీనామాలు చేసి 25 మంది ఎంపీలు నిరాహార దీక్షకు కూర్చుంటే.. దేశం మొత్తం మనవైపు ఎందుకు చూడదో చూద్దాం.

+  ఎంపీలు రాజీనామాలు చేస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్‌ - బీజేపీ - చంద్రబాబు అందరూ ప్రజలను మోసం చేశారు. వీళ్లను ఎవరూ నమ్మకండి. 25 మంది వైఎస్సార్‌ సీపీ ఎంపీలను గెలిపించండి. ఎవరు హోదా ఇస్తే వారికి మద్దతు ఇద్దాం. ఏపీకి రావాల్సిన డిమాండ్లను నిజాయితీగా మా పార్టీ అడుగుతోంది.



Tags:    

Similar News