ఆ మీడియా క‌థ‌నంపై జ‌గ‌న్ ఏం చెప్పారంటే?

Update: 2017-05-16 04:56 GMT
విష‌యం ఏదైనా.. ఎవ‌రికి వారు త‌మ వాద‌న‌ల్ని వినిపిస్తుంటారు. అయితే.. అంద‌రూ చెప్పే వాద‌న‌ల్ని విని.. త‌ర్క‌బ‌ద్ధంగా ఉన్న వారి మాట‌ల్ని న‌మ్మాలి. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో అచ్చు అవుతున్న క‌థ‌నాల వెన‌క న‌డిచే పావుల క‌థ గురించి ఎవ‌రికి వారు త‌మ వాద‌న‌ల్ని వినిపిస్తుంటారు.

ఇలాంట‌ప్పుడు ఎవ‌రి మాట‌ల్ని న‌మ్మాల‌న్న‌ది అతి పెద్ద సందేహం క‌లుగుతుంది. తాజాగా చూస్తే.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సంబంధించి ఒక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ప్ర‌చురించింది. చ‌దివినంత‌నే న‌మ్మ‌కం క‌లిగేలా ఉన్న క‌థ‌నానికి కౌంట‌ర్ ను జ‌గ‌న్ ఇచ్చారు. మ‌రీ ఉదంతంలో ఎవ‌రి వాద‌న ఏమిటి? అస‌లు నిజం ఏమిటి? అన్న‌ది మీరే డిసైడ్ చేసేయొచ్చు. ఎందుకంటే.. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల్ని మీ దృష్టికి తెస్తున్నాం. త‌ర్కంతో ప్ర‌శ్న‌లు వేసుకుంటే.. అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగింది? ఇరు వ‌ర్గాలు ఏం చెప్పాయ‌న్న‌ది చూస్తే..

ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో అచ్చు అయిన క‌థ‌నం సారాంశాన్ని చెబితే.. ఈ మ‌ధ్య‌న ప్ర‌ధాని మోడీని క‌లిసిన విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌.. త‌న ప‌ట్ల  కొంద‌రు ఈడీ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిని ప్ర‌స్తావిస్తూ.. వారంతా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర‌ఫున ప‌ని చేస్తున్న‌ట్లుగా సందేహాన్ని వ్య‌క్తం చేసిన విష‌యాన్ని బ‌య‌ట‌పెడుతూ.. ప్ర‌ధానిని జ‌గ‌న్ క‌లిసింది త‌న మీద ఉన్న కేసుల మీద‌నే త‌ప్పించి.. ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల గురించి ఎంత‌మాత్రం కాద‌న్న వాద‌న‌ను వినిపించారు.

తాము వినిపిస్తున్న వాద‌న‌కు త‌గ్గ‌ట్లే.. జ‌గ‌న్ సంత‌కం ఉన్న విన‌తిప‌త్రం చివ‌రి పేజీని అచ్చేశారు. ప్ర‌ధానిని క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్‌.. తాను మోడీతో ఏ విష‌యాల్ని మాట్లాడింది చెప్పారు. వాటిల్లో ఈడీ ముచ్చ‌ట లేద‌న్న‌ది స‌ద‌రు మీడియా సంస్థ లేవ‌న‌నెత్తిన అతి పెద్ద ధ‌ర్మ సందేహం.

స‌ద‌రు మీడియా క‌థ‌నాన్ని చ‌దివిన‌ప్పుడు.. నిజంగానే జ‌గ‌న్ అలా చేశారా? అన్న డౌట్ వ‌చ్చేలా క‌థ‌నం ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. త‌ర్క‌బ‌ద్ధ‌మైన ప్ర‌శ్న‌ల్ని సంధిస్తూ జ‌గ‌న్ చేసిన వాద‌న‌ను విన్న‌ప్పుడు.. ఏది నిజం? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇట్టే దొరుకుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మోడీని క‌లిసిన‌ప్పుడు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్న విన‌తి ప‌త్రం చివ‌రి పేజీ గురించి జ‌గ‌న్ ఇచ్చిన వివ‌ర‌ణను ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..  

‘‘న్యాయం తరపున మాట్లాడాల్సిన ఓ మీడియా సంస్థ ఏకంగా జరగనిది జరిగినట్లుగా చిత్రీకరించింది. ఫిబ్రవరి 17న లేఖ రాస్తే, దానిమీద ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి ఏప్రిల్‌ 13న స్పందన వచ్చింది. నేను ప్రధానిని కలిసింది మే 10న. అంటే ఒక వ్యక్తికి లేఖ రాసి, ఆ వ్యక్తి దగ్గర్నుంచి రిప్లై కూడా వచ్చిన తర్వాత బుద్ధి ఉన్నవాడెవడైనా అదే వ్యక్తి దగ్గరికి వెళ్లేటప్పుడు ఆ పాత లేఖను తీసుకొని వెళ్లి మళ్లీ అతడికే ఇస్తాడా? కామన్‌ సెన్స్‌(కనీస విచక్షణ) ఉండాలి. అట్లాంటిది ఈ రోజు ఏం జరిగింది? స‌ద‌రు మీడియా సంస్థలో ఏం అచ్చేశారు? నేను మే 10న ప్రధానికి ఇచ్చిన లేఖను పక్కనపెట్టి ఫిబ్రవరి 17న రాసిన లేఖను ప్రచురించారు. ఆ లేఖ మొదటి పేజీని చూపిస్తే తేదీ కనిపిస్తుంది కాబట్టి చివరి లైన్లు అచ్చు వేశారు. దానిపై నా సంతకం ఉందన్నారు. ఏ లేఖపై అయినా నా సంతకం అలాగే ఉంటుంది. ఇదే లేఖను మే 10న ప్రధానికి ఇచ్చానంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన వ్యవస్థలో ఎవరైనా బతగ్గలుగుతారా?’’ అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేస్తున్న త‌ప్పుల్ని ప్ర‌ధాని మోడీకి కాకుండా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌న‌కు ఫిర్యాదు చేయ‌లేం క‌దా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. అధికార‌బ‌లంతో చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షమే ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తుంటే.. అధికారుల్ని ప్ర‌లోభ పెట్టి వారితో త‌ప్పులు చేయిస్తూ ఉంటే.. ఎవ‌రికి ఫిర్యాదు చేయాలి? భార‌త రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లో ఉన్న మ‌నం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కో.. అమెరికా గ‌వ‌ర్న‌ర్ కో ఫిర్యాదు చేయ‌లేం క‌దా? రేపు మీ(విలేకరులు) మీద ఇలాంటిది జరిగితే మీరు కూడా ఇలాగే ఫిర్యాదులు చేస్తారు. ఒక వ్యక్తికి బెయిల్‌ ఇచ్చి, అతడు సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు, ఆ బెయిల్‌ను రద్దు చేయండి అంటూ కోర్టుకు వెళ్లడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని రుజువు కాకుండా అతడిని జైలులో పెట్టడమే తప్పు. నేరం రుజువు కాని వ్యక్తిని రాజ్యాంగ ప్రకారం మూడు నెలల్లోపు జైలు నుంచి విడుదల చేయాలి. అంతకంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంచకూడదు. కానీ, ఆ రోజు చంద్రబాబు.. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై.. ఇద్దరూ కలిసి కేసులు వేశారు. పిటిషనర్లు వారే, కేసులు నడిపించేదీ వాళ్లే. అప్పుడు వ్యవహారమంతా చంద్రబాబు ఫోన్లలోనే నడిపించారు" అని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

ఎంపిక చేసిన లీక్స్ ను మీడియాకు ఇచ్చి.. ఏం చెప్పాలో? ఎంత చెప్పాలో.. ఏ ర‌కంగా చెడ్డ‌పేరు తేవాలో అంతా చేసేశార‌న్న జ‌గ‌న్‌..  "ఆ రోజు కాంగ్రెస్‌ పార్టీతో కలిసి చంద్రబాబు కథ నడిపించారు. ఈ రోజు తన మంత్రులను కేంద్రంలో కూర్చోబెట్టి వాళ్ల ద్వారా, తనకు అత్యంత సన్నిహితులైన బీజేపీలోని మంత్రులను ఉపయోగించుకొని అదే కార్యక్రమం చేస్తున్నారు. ఒక రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టుకెళ్లారు. ఆ ఇంటర్వ్యూతో నాకేం సంబంధం? చంద్రబాబు దారుణంగా వ్యవరిస్తున్నారు, అధికారులను వాడుకుంటున్నారు, ఎవరెవరూ ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు, ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరి ఆదేశాలతో వీళ్లు పనిచేస్తున్నారు, వీళ్లకున్న సంబంధాలేంటి? అన్నింటి మీదా ఎంక్వైరీ వేయండి, ఇలాంటివి జరగనివ్వకండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాశాం. అవతలి వ్యక్తి కొడుతున్నాడు కాబట్టి కొట్టించుకుంటే ఎవరూ బతకరు. ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితుల్లో ఫిర్యాదు చేస్తాం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని కలిసి, ప్రజల సమస్యలను వివరించడం తప్పా?" అని ప్ర‌శ్నించారు. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ వాద‌న‌.. దానిపై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ వినిపంచిన వాద‌న రెండింటిని ఇచ్చాం. త‌ర్క‌బ‌ద్ధంగా ఎవ‌రికి వారు ప్ర‌శ్న‌లు వేసుకొని.. ఎవ‌రి వాద‌న‌లో ఎంత నిజం ఉంద‌న్న విష‌యాఆన్ని ఎవ‌రికి వారు డిసైడ్ కావ‌టం బాగుంటుంది. సో.. స‌మాచారం మేం ఇచ్చాం. కంక్లూజ‌న్ కి మీరే రండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News