మంత్రులు డ‌మ్మీలు కాదు.. అధికారుల‌కు జ‌గ‌న్ షాక్!

Update: 2019-06-11 04:30 GMT
రాజ‌కీయం ఎప్పుడో మారిపోయింది. గ‌తానికి ప్ర‌స్తుతానికి సంబంధం లేని రీతిలో రాజ‌కీయం త‌యారైంది. ప‌వ‌ర్లో ఉన్న సూప‌ర్ బాస్ త‌ప్పించి.. మిగిలిన వారంతా.. వ్య‌వ‌స్థ అంతా ఉత్త డ‌మ్మీలుగా మారిపోయిన ప‌రిస్థితి కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించే ప‌రిస్థితి ప్ర‌తి చోటా క‌నిపిస్తోంది.

కేంద్రంలోని మోడీస‌ర్కారు కానీ.. తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారు కానీ.. మిగిలిన ప‌లు చోట్ల ఎక్క‌డైనా స‌రే.. సూప‌ర్ బాస్ ఒక్క‌రే త‌ప్పించి.. మిగిలిన వారికి ఇవ్వాల్సిన మ‌ర్యాద‌.. గౌర‌వం పోయి చాలా కాల‌మే అయ్యింది. అలా ధ్వంస‌మైన విధానాల్ని తిరిగి పున‌రుద్ధ‌రించేలా వ్య‌వ‌హ‌రించి కొత్త అనుభ‌వాన్ని క‌లిగేలా చేశారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి స‌ర్వాధికారి. అలా అని.. ప్ర‌భుత్వంలో ఉన్న కీల‌క‌మైన మంత్రులు డ‌మ్మీల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఏ మాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో చేసి చూపించారు జ‌గ‌న్‌. అన్ని నిర్ణ‌యాల్ని ముఖ్య‌మంత్రి మాత్ర‌మే తీసుకోవాలి.. మంత్రులు మౌన ప్రేక్ష‌కులుగా ఉండివాల‌న్న‌ట్లుగా ఈ మ‌ధ్య‌న ప‌లువురు ముఖ్య‌మంత్రులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇది త‌ప్ప‌న్న విష‌యాన్ని తేల్చి చెప్ప‌ట‌మే కాదు.. త‌న పాల‌న ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని అటు మంత్రుల‌కు.. ఇటు సీనియ‌ర్ అధికారుల‌కు ఒకే టైంలో అర్థ‌మ‌య్యేలా చెప్పేశారు జ‌గ‌న్‌. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో జ‌గ‌న్ ముందుకు ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసే ఫైల్ ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్ ను ఆ శాఖ‌ను నిర్వ‌హిస్తున్న మంత్రికి దృష్టికి వెళ్లిందా? అంటూ అధికారుల్ని ప్ర‌శ్నించారు. స‌ద‌రు మంత్రిని ఇదే విష‌యాన్ని వారి ముందే అడిగారు.

త‌న దృష్టికి ఆ ఫైల్ రాలేద‌న్న మంత్రి మాట‌ల‌కు స్పందించిన జ‌గ‌న్‌.. అధికారిక నివేదిక‌లు.. స‌మాచారాన్ని మంత్రుల‌కు ఇవ్వ‌కుండా త‌న వ‌ద్ద‌కునేరుగా పంపొద్ద‌ని అధికారుల‌కు క్లారిటీ ఇచ్చేశారు.మంత్రులు డమ్మీలు కార‌ని.. శాఖాప‌ర‌మైన ప్ర‌తి అంశ‌మై వారికి తెలియాల్సిందేన‌న్న జ‌గ‌న్‌.. ముందుగా మంత్రికి తెలియ‌జేశాకే.. ఆ మంత్రి ద్వారా త‌న వ‌ద్ద‌కు స‌మాచారాన్ని తీసుకురావాల‌న్న పాత ప‌ద్ద‌తిని గుర్తు చేశారు.

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌పై మంత్రులు.. అధికారుల అభిప్రాయాల్ని సేక‌రించిన జ‌గ‌న్‌.. సంస్థ‌ను కార్పొరేష‌న్ లా ఉంచుతూ.. ప్ర‌భుత్వ ఉద్యోగుల స్థాయిలో జీతభ‌త్యాలు చెల్లిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అయితే.. పాద‌యాత్ర స‌మ‌యంలో తాను ఇచ్చిన హామీ నెర‌వేరేలా నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో నివేదిక‌ను సిద్ధం చేయాల‌ని జ‌గ‌న్ కోరారు. తాజా ఎపిసోడ్ లో మంత్రుల‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త‌ను చెప్పేసిన జ‌గ‌న్‌.. మంత్రులంద‌రి మ‌న‌సుల్ని దోచేశార‌ని చెప్పాలి. తాను త‌ప్పించి మిగిలిన వారంతా ఉత్త డ‌మ్మీలుగా ఉండేలా ప్ర‌భుత్వం ప‌ని చేయ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో చేసి చూపించారు జ‌గ‌న్‌.
Tags:    

Similar News