మంత్రుల సలహాలకు జగన్ దిమ్మ తిరిగే పంచ్ లు

Update: 2020-03-05 11:45 GMT
మంత్రివర్గ సమావేశంలో మంత్రులు ఇచ్చే సలహాలు.. సూచనలు ఏ మాత్రం బాగోలేకున్నా.. వెంటనే వారికి పంచ్ లు తప్పవంటున్నారు. ఇందుకు తాజాగా ముగిసిన క్యాబినెట్ మీటింగ్ ఉదాహరణగా చెబుతున్నారు. తన ఆలోచనల్ని.. తన అభిప్రాయాల్ని పట్టించుకోకుండా తమకు తోచినట్లుగా సలహాలు ఇచ్చే మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ దిమ్మ తిరిగేలా బదులు ఇవ్వటమే కాదు.. వారు మళ్లీ నోరు విప్పేందుకు భయపడేలా ఆయన మాటలు ఉంటాయని చెబుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయం అవసరమన్న విషయాన్ని మంత్రులకు అర్థమయ్యేలా చెప్పిన జగన్ మాటలకు మంత్రులు కొందరు సలహాల్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ఇలాంటి వాటికి జగన్ నుంచి వచ్చిన స్పందనతో మిగిలిన మంత్రులు కామ్ అయినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో మద్యం..డబ్బులు పంచే ధోరణి ఈసారి అస్సలు కనిపించకూడదన్న మాట జగన్ చెప్పినప్పుడు.. అలాంటిది సాధ్యమేనా? అన్న భావనను ఒకరిద్దరు మంత్రుల నోటి నుంచి వస్తే.. ఎందుకు కాదు? అంటూ జగన్ స్వరం కటువుగా వినిపించటంతో మౌనం దాల్చారని చెబుతున్నారు.

మద్యం పంపిణీ లేకుండా ఉండటానికి.. దుకాణాల్ని మూసేస్తే సరిపోతుందని ఇద్దరు మంత్రులు సలహా ఇవ్వగా.. వారికి దిమ్మ తిరిగే పంచ్ పడినట్లుగా చెబుతున్నారు. మద్యం దుకాణాల్ని మూసేసి పంపిణీ జరగకుండా చేసి మొనగాడినని అనిపించుకుందామా? మద్యం దుకాణాలు ఉన్నా.. పంపిణీ చేయకుండా ఉండగలిగితే ప్రభుత్వ సత్తా తెలుస్తుందన్న మాట జగన్ నోటి నుంచి రావటంతో ఆ ఇద్దరు మంత్రులు నోటి వెంట మాట రాలేదంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో వీలైనంతవరకూ ఏకగ్రీవాలు ఉండేలా చూద్దామన్న సీఎం మాటలకు.. కొందరు మంత్రులు మరోలా స్పందించారు. ఏకగ్రీవాలంటే బరిలో ఉన్న వారు ఏదో ఒకటి ఆశిస్తారు కదా? అన్న ప్రశ్న వేయగా..వారి మాటల్ని లైట్ తీసుకోవటమేకాదు.. ‘‘అలాంటిదేమీ ఉండదు. ఏకగ్రీవాల్ని చేయటానికి స్థానిక పరిస్థితులు కలిసి వస్తాయి. డబ్బులు.. పదవుల్ని ఆశ చూపించాల్సిన అవసరం లేదు. సరైన రీతిలో డీల్ చేస్తే చాలు’’ అన్న జగన్ మాటలతో మంత్రులు మిన్నకుండిపోయారని చెబుతున్నారు. తమకున్న పవర్.. ప్రజల్లో ఉన్న ఆదరణ=తో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న జగన్ ఐడియాలజీకి భిన్నంగా తమ వాదనల్ని వినిపించిన మంత్రులకు పంచ్ లు పడ్డాయని చెప్పక తప్పదు.






Tags:    

Similar News