పాలనపై పట్టుకు జగన్ సంచలన నిర్ణయం

Update: 2019-10-25 08:17 GMT
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కాకున్నా.. పాలనా రథాన్ని పరుగులు తీయించే విషయంలో ఇప్పటికే అందరి మన్ననలు పొందుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వరుస పెట్టి తాను ఇస్తున్న హామీలు.. తీసుకుంటున్న నిర్ణయాల్ని అమలు చేసే విషయంలో అధికార యాంత్రంగా చేస్తున్న ఆలస్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనులు పరుగులు తీయాల్సిన అవసరం ఉందని చెప్పటంతో పాటు..ప్రభుత్వ విధానాలు వేగంగా ప్రజల వద్దకు చేరాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని గుర్తించిన జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. అధికారుల పనితీరు మెరుగు పడని పక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్న ఆయన.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

దీని ప్రకారం ఏపీ బిజినెస్ రూల్స్ 2018కి సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శల నుంచి ముఖ్యమంత్రి ఈ-ఆఫీస్ కు పంపే ఫైళ్లను మూడు విభాగాలుగా చేయనున్నారు. అత్యవసరం.. అవసరం.. ఫర్లేదన్న కేటగిరిలు విభజిస్తారు. ప్రతి శాఖ నుంచి వచ్చే ఫైళ్లను ఆర్థిక.. న్యాయశాఖల నుంచి క్లియరెన్స్ లు తీసుకొనేందుకు సైతం గడువు విధించారు.

న్యాయ.. ఆర్థిక శాఖలు మినహాయించి మిగిలిన అన్ని శాఖలు తమకొచ్చే ఫైళ్లను ఒక రోజులో క్లియర్ చేయాలని.. లేని పక్షంలో అవి అటోమేటిక్ గా క్లియర్ అయినట్లుగా భావించాల్సి ఉంటుందని తేల్చారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత పదిహేను రోజుల వ్యవధిలో జీవో విడుదల కావాలని ఆదేశాలు జారీ చేశారు.

సీఎం తర్వాత నిర్ణీత సమయంలో జీవోలు ఇవ్వకుంటే కార్యదర్శలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. మీడియాకు సంబంధం ఉన్న అంశాల్లో ముఖ్యమంత్రికి తెలీకుండా జీవోలు ఇవ్వరాదంటూ విస్పష్ట ఆదేశాల్ని జారీ చేశారు. ముఖ్యమంత్రికి పంపిన ముసాయిదా ఉత్తర్వులపై సీఎంవో నుంచి ఐదు రోజుల్లో ఆదేశాలు రాని పక్షంలో ఆమోదం పొందినట్లుగా గుర్తించి జీవో విడుదల చేయొచ్చని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనటం గమనార్హం.


Tags:    

Similar News