జ‌గ‌న్ ప్ర‌భుత్వం నాలుగు నెల‌ల్లోనే రూ.41 వేల కోట్ల అప్పు చేసిందా?

Update: 2022-08-03 10:30 GMT
ప్ర‌తిప‌క్ష పార్టీలు, ఆర్థిక నిపుణుల అభ్యంత‌రాల‌ను లెక్క చేయ‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పులు చేయడంలో దూకుడు క‌న‌బ‌రుస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీలంక మాదిరిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌యార‌య్యేలా ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన లెక్క‌ల్లోనూ అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశంలో టాప్ 6లో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.41,603 కోట్ల రుణం తీసుకుంద‌ని ప్ర‌ధాన మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది. రిజర్వుబ్యాంకు ఆగ‌స్టు 2న‌ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో తీసుకున్న రూ.2,000 కోట్లతో కలిపి ఈ నాలుగు నెల‌ల్లోనే అప్పు రూ.41,603 కోట్ల‌కు చేరుకుంద‌ని వెల్ల‌డించింది.

పన్నెండేళ్ల కాలపరిమితితో 7.72% వడ్డీతో రూ.వెయ్యి కోట్లు, 20 ఏళ్లలో చెల్లించేలా 7.82% వడ్డీతో మరో రూ.వెయ్యి కోట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. నాలుగు నెల‌ల్లో నెలకు సగటున రూ.10 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్ర‌భుత్వం రుణం సేకరించింద‌ని చెబుతున్నారు. ఏప్రిల్‌లో రాష్ట్ర రాబడి రూ.9,317 కోట్లు. ప్రస్తుతం అప్పు సగటు అంతకన్నా ఎక్కువే ఉందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లో రూ.43,803 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేందుకు అవకాశం ఉంద‌ని తాజాగా పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి రాజ్యసభలో వెల్లడించారు. ఇది కాకుండా కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌) అమలు వల్ల కేంద్రం రూ.4,203.96 కోట్లు అదనపు రుణానికీ అనుమతి ఇచ్చింద‌ని అంటున్నారు. ఇదికాకుండా నాబార్డు రుణం మ‌రో రూ.2,000 కోట్లు తీసుకునేందుకు అనుమతులు ఉన్నాయని మంత్రి ప్రకటించారు.

అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం జూన్‌ నెలాఖరు వరకు బహిరంగ మార్కెట్ నుంచి రుణం రూ.21,890 కోట్లు, నాబార్డు నుంచి రూ.40.17 కోట్లు, కేంద్రం నుంచి రూ.1,373.47 కోట్లు రుణం తీసుకుంద‌న్నారు. జూన్‌ నెలాఖరు తర్వాత ఈ ఆగస్టు రెండో తేదీ వరకు తీసుకున్న రుణాల మొత్తం కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఉంద‌ని చెబుతున్నారు. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణమే రూ.10 వేల కోట్లని చెబుతున్నారు.

ఇవికాకుండా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.8,300 కోట్ల రుణం కూడా ప్రభుత్వం సమీకరించింద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఇవన్నీ కలిపితే ఈ ఆర్థిక సంవ‌త్సరం తొలి నాలుగు నెల‌ల్లోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.41,603 కోట్ల రుణం తీసుకున్నట్లయింద‌ని అంటున్నారు.
Tags:    

Similar News