ఉక్కు చిక్కు ముడిలో జగన్... ?

Update: 2021-11-02 00:30 GMT
మౌనం ఎపుడూ సమాధానం కాదు. అది అందమైన భాష అయితే అయి ఉండవచ్చు. కానీ ఎపుడూ ఆ భాష వాడుదామనుకున్నా కుదరదు. సందర్భాన్ని బట్టి మౌనానికి అర్ధాలు మారుతూంటాయి. మౌనం అర్ధాంగీకారమని కూడా పెద్దలు చెబుతారు. జగన్ మౌనం కొన్ని సార్లు మేలు చేస్తే మరి కొన్ని సార్లు కీడు చేసింది. అయితే అది రాజకీయాలలో అయితే లాభనష్టాలు పార్టీ చూసుకుంటుంది. కానీ ఇక్కడ అయిదున్నర కోట్ల ప్రజలు ఉన్నారు. వారి విషయంలో మౌనంగా ఉంటే విస్తృత ప్రయోజనాలకే ముప్పు వాటిల్లుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ చేయాల్సింది ఇంతేనా అంటే జవాబు మౌనమే వస్తోంది.

స్టీల్ ప్లాంట్ నిజానికి కేంద్రానిదే. కానీ అది లోకేట్ అయి ఉంది ఏపీలో, పైగా జగన్ పరిపాలనా రాజధాని చేయాలనుకుంటున్న విశాఖలో. ఏపీలో ఏ మాత్రం ఆదాయవనరులు వచ్చే సిటీ ఏదైనా ఉంది అంటే అది విశాఖ మాత్రమే. విశాఖలో కొత్త పెట్టుబడులు ఏవీ రావడంలేదు. ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థను కూడా ప్రైవేట్ పరం చేసుకుంటే ఇక ఏపీకి కానీ విశాఖ కానీ ఆశాదీపం ఏముంటుంది. నిజానికి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అన్నపుడే రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా స్పందించాలి.

జగన్ అయితే ఉక్కు కార్మిక సంఘాలతో మాట్లాడారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రానికి ఈ విషయంలో రెండు సార్లు లేఖ రాశారు. అంతా బాగానే ఉంది. కానీ ఢిల్లీకి అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకు వెళ్ళరు, ఈ విషయంలో జగన్ కి ఉన్న ఇబ్బంది ఏంటి అన్నదే మేధావుల నుంచి కార్మిక లోకం వరకూ వస్తున్న అతి పెద్ద ప్రశ్న. అంతే కాదు, జగన్ ఈ విషయంలో తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాల్సి ఉందని కూడా అంతా అంటున్నారు. నిజానికి ఇది కేంద్రం తెచ్చి పెట్టుకున్న తలనొప్పి. అయితే బీజేపీకి ఏపీలో రాజకీయంగా ఏమీ లేదు. రేపటి ఎన్నికల మీద కూడా ఆశలు లేవు. అందుకే చాలా సునాయాసంగా విశాఖ స్టీల్ ని ప్రైవేట్ కి అప్పగిస్తామని అంటోంది.

కానీ ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా నష్టపోయేది వైసీపీయే. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే అంతటి సంస్థ మళ్లీ వస్తుంది అన్న గ్యారంటీ లేదు. మరి ఉన్న దాన్ని కాపాడుకోవాలి కదా. ఈ విషయంలో అఖిల పక్షంతో కలసి ఢిల్లీ వెళ్లాలని టీడీపీ సహా అన్ని పార్టీలు కోరుతున్నాయి. చంద్రబాబు అయితే జగన్ నాయకత్వంలో తాము ఢిల్లీ వస్తామని చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా అఖిల పక్షాన్ని డిమాండ్ చేశారు. మరి ఆయన కూడా జగన్ వెంట నడవడానికి రెడీ అన్నట్లే కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా లీడ్ తీసుకుని ఆల్ పార్టీని తీసుకెళ్ళడానికి జగన్ కి ఉన్న అభ్యంతరాలు ఏంటి అన్న ప్రశ్న వస్తే జవాబు మాత్రం లేదు.

జగన్ స్టీల్ ప్లాంట్ విషయంలో చేయాల్సింది చేశామని అనుకోవచ్చు. కానీ కార్మికులు కానీ ప్రజలు కానీ అలా అనుకోవడంలేదు. పైగా ప్రధానికి ఈ విషయంలో ఒకసారి ముఖస్థంగా కలవాలని అంతా భావిస్తున్నారు దానిని నెరవేర్చాల్సిన బాధ్యత జగన్ దే. అఖిల పక్షం ఎదుట ప్రధాని తాము ఈ రోజుకీ ప్రైవేటీకరణకు ఓకే అని చెబితే అపుడు కేంద్రానిదే నూటికి నూరు శాతం తప్పు బాధ్యత అవుతుంది. ఈ విషయంలో బాల్ అయితే ఇపుడు జగన్ కోర్టులోనే ఉంది అంటున్నారు. మరి జగన్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లగలరా. ఆయన ఆలోచనలు ఏంటి అన్నది చూడాలి. ఏది ఏమైనా విశాఖ ఉక్కు విషయంలో ఏపీ బీజేపీ సేఫ్ జోన్ లో ఉండగా జగన్ మాత్రం చిక్కుల్లో పడిపోయారని చెప్పకతప్పదు.




Tags:    

Similar News