ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో తొలి ఆర్డినెన్స్ ఇదేన‌ట‌!

Update: 2019-06-11 04:37 GMT
చేతిలో అధికారం ఉంటే స‌రిపోదు.  దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసే స‌త్తా చాలా ముఖ్యం. ముఖ్య‌మంత్రిగా త‌న‌కు బోలెడంత అనుభ‌వం ఉంద‌ని గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబుకు మించిన స‌త్తా త‌న సొంత‌మ‌న్న‌ట్లుగా కేవ‌లం ప‌ది రోజుల్లోనే పాల‌న‌పై త‌న ముద్ర వేశారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు పెట్టించ‌టం అంటే ఏమిట‌న్న విష‌యాన‌ని చేత‌ల్లో చేసి చూపిస్తున్నారు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో ఆయ‌న అన్ని వ‌ర్గాల‌కు హ్యాపీ చేస్తున్న వైనం ప‌లువురు సీనియ‌ర్ నేత‌లకు సైతం ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఇన్ని నిర్ణ‌యాలా?  అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక నిర్ణ‌యం తీసుకోవ‌టానికి ఎంతోకొంత మ‌దింపు అవ‌స‌రం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అధికారంలోకి రాక ముందే చెప్పే మాట‌ల‌కు.. వ‌చ్చాక చేసే ప‌నుల‌కు పోలిక ఉండ‌ద‌న్న మాట‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎన్నిక‌ల్లో గెలిచి అధికారాన్నిచేప‌ట్టిన జ‌గ‌న్‌.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారి కోసం బ‌దులు తీర్చుకోవాల‌ని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ నెల 12 నుంచి ప్రారంభ‌మ‌య్యే ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో తొలి ఆర్డినెన్స్ కు సంబంధించిన ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం పార్టీ నేత‌ల్లోనూ.. క్యాడ‌ర్ లోనూ పండుగ వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది. పార్టీ కోసం పూర్తిగా ప‌ని చేసిన వారికి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల్ని భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని మార్చేందుకు వీలుగా ఆర్డినెన్స్ ను ఆమోదించ‌నున్నారు.

ఇప్ప‌టికే తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ ఛైర్మ‌న్ గా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి కేటాయించ‌గా.. టీటీడీ ఛైర్మ‌న్ గా వైవీ సుబ్బారెడ్డిని నియ‌మించాల‌ని నిర్ణ‌యింటం తెలిసిందే. ఇదే విధ‌గా ఏపీలో ఉన్న వివిధ నామినేటెడ్ పోస్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి నియ‌మ‌కాల్ని ర‌ద్దు చేసి.. కొత్త‌గా ప‌లువురిని నియ‌మించ‌నున్నారు.

పార్టీ కోసం ప‌ని చేసిన వారి వివ‌రాల్ని త‌న‌కు పంపాల్సిందిగా జిల్లా మంత్రులు.. స్థానిక ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా ప‌ద‌వుల పంప‌కంతో కేబినెట్ లో మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని వారిని సైతం సంతోషానికి గురి చేసిన‌ట్లు అవుతుంది.

ఊహించని రీతిలో 151 స్థానాల్లో విజ‌య‌కేత‌నం ఎగుర వేసిన నేప‌థ్యంలో.. పార్టీలో ప‌దవుల కోసం డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించ‌నివారు కాస్తంత అసంతృప్తితో ఉన్నారు. అయితే.. అంద‌రూ కోరుకున్న ప‌ద‌వులు ఇవ్వ‌లేన‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన జ‌గ‌న్‌.. అదంతా స‌మీక‌ర‌ణాలు కుద‌ర‌కే త‌ప్ప మ‌రింకేమీ కాద‌న్న సంకేతాల్ని స్ప‌ష్టంగా పంపారు.

అదే స‌మ‌యంలో.. ప‌ద‌వుల భ‌ర్తీ కోసం నామినేటెడ్ పోస్టుల్ని త్వ‌ర‌గా భ‌ర్తీ చేయ‌టానికి వీలుగా తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో తొలి ఆర్డిన‌న్స్ నామినేటెడ్ ప‌ద‌వులకు సంబంధించింది కావ‌టం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. క్యాడ‌ర్ పండుగ చేసుకునే అంశంగా దీన్ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News