తిరుపతి ఉపఎన్నికపై జగన్ పక్కా ప్లానింగ్

Update: 2020-12-19 15:01 GMT
తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నిక విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు అభ్యర్ధిని ప్రకటించకపోయినా బీజేపీ ఎంత హడావుడి చేస్తోందో అందరు చూస్తున్నదే. ఇదే సమయంలో అభ్యర్ధిని ముందుగానే ప్రకటించేసిన తెలుగుదేశంపార్టీ కూడా చాపక్రింద నీరులాగ ప్రచారాన్ని ప్రారంభించేసింది. అభ్యర్ధి పనబాక లక్ష్మి బహిరంగంగా ఇంతవరకు స్పందిచకపోయినా, ప్రచారానికి శ్రీకారం చుట్టకపోయినా పార్టీ మద్దతుదారుల్లో అయితే ప్రచారం జరిగిపోతోంది.

ఇటువంటి నేపధ్యంలో అనధికారికంగా అభ్యర్ధి ఎవరో జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చేశారు. అయితే అధికారికంగా ఎందుకు ప్రకటించలేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ నేపధ్యంలోనే జగన్ పెద్ద ప్లాన్ తోనే వ్యవహరిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటనతో బయటపడింది.

ఈనెల 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ళ పట్టాల పంపిణీకి జగన్ శ్రీకారం చుడుతున్న విషయం అందిరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈ పథకాన్ని జగన్ చిత్తూరు జిల్లా నుండే ప్రారంభించబోతున్నారట. అదికూడా తిరుపతి నుండి లేకపోతే శ్రీకాళహస్తి లో జరిగే కార్యక్రమంలో జగన్ పాల్గొంటారని పెద్దిరెడ్డి చెప్పారు. ఇక్కడే ఎందుకన్న విషయం మంత్రి చెప్పకపోయినా అందరికీ అర్ధమైపోయింది.

తిరుపతి లోక్ సభ పరిధిలో వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే తిరుపతి, శ్రీకాళహస్తి కూడా ఉన్నాయి. అందుకనే ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో జగన్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. కార్యక్రమంలో ఎలాగూ జగన్ ప్రసంగిస్తారు. అప్పుడు తన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ళపట్టాల కార్యక్రమంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా గుర్తుచేస్తారు. పనిలో పనిగా పార్టీ తరపున పోటీ చేయబోయే డాక్టర్ గురుమూర్తిని కూడా పరిచయం చేసినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాల సమాచారం.

అంటే ఉపఎన్నికల ప్రచారాన్ని జగన్ దాదాపు ప్రారంభించేసినట్లే లెక్కవుతుంది. ఉపఎన్నిక జరిగే నియోజకవర్గంలో భారీ బహిరంగసభ నిర్వహణ, ప్రభుత్వ పథకాలను వివరించటం, అభ్యర్ధిని పరిచయం చేయటం అంటే ఉపఎన్నికల ప్రచారం కాక మరేమవుతుంది ? అదిరింది కదూ జగన్ ప్లానింగ్.
Tags:    

Similar News