ఆనందయ్య ఔషధంపై జగన్ కీలక నిర్ణయం!

Update: 2021-05-21 11:30 GMT
కొన్నిసార్లు ప్రజల స్పందన ఒకలా ఉండొచ్చు. శాస్త్రీయ అంశాలు మరోలా ఉండొచ్చు. ఇలాంటివేళ.. తనకేం పట్టనట్లుగా ఉండే ముఖ్యమంత్రులు కొందరు ఉంటారు. అందుకు భిన్నంగా.. జనం నమ్మకాల్ని పరిగణలోకి తీసుకుంటూనే.. అదేసమయంలో శాస్త్రీయత ఎంతన్న విషయానికి సమ ప్రాధాన్యత ఇవ్వటమే కాదు.. మంచి ఎక్కడ ఉన్నా మేం స్వీకరిస్తామన్నట్లుగా వ్యవహరించే పాలకులు చాలా తక్కువగా ఉంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడలానే వ్యవహరిస్తున్నారు.

కరోనాకు ఆయుర్వేదం వైద్యంగా క్రష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఔషధానికి ప్రజల్లో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆయన మందు వాడిన వారికి కరోనా రాదని.. కరోనాతో ఇబ్బంది పడుతున్న వారు.. ఈ మందును కానీ తీసుకుంటే రెండు రోజుల్లో నయమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఇందులోని శాస్త్రీయ అంశాలు ఎంతన్నది ఇప్పటివరకు నిరూపితం కాలేదు. ఆయుర్వేద వైద్యుల టీం ఒకటి ఈ మందుపై ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దీని వల్ల ఎలాంటి నష్టం లేదన్న విషయాన్ని చెబుతూనే.. ఆనందయ్యకు మందును తయారు చేసే శాస్త్రీయ ఆర్హత లేదన్న విషయాన్ని ప్రస్తావించింది.

మరోవైపు.. ఈ మందు కోసం వేలాది మంది క్రష్ణపట్నంకు పోటెత్తుతున్నారు. ఇలాంటివేళ.. చేష్టలుడిగినట్లుగా చూస్తుండిపోకుండా వెంటనే స్పందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగంలోని అధికారులతో పరీక్షలు జరపాలని నిర్ణయించటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన ఒక టీంను పంపుతున్నారు.

ఈ రోజు సాయంత్రానికి ఐసీఎం సభ్యులతో కూడిన టీం ఒకటి ఈ మందులోని శాస్త్రీయ అంశాలపై ఫోకస్ పెట్టనుంది. ఇక.. ఈ రోజు ఆనందయ్య మందు కోసం వేలాది మంది రావటం.. క్యూలైన్లు భారీగా నిండిపోవటమే కాదు.. స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతి ఇవ్వలేదు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పంపిణీ ప్రారంభించినా.. కాసేపటికే నిలిపివేశారు. ఈ రోజుకు మందు పంపిణీ లేదని పోలీసులు ప్రకటించారు. దీంతో.. ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరికొందరు మాత్రం అక్కడే వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ మందు లెక్కను తేల్చే విషయంలో జగన్ వేగంగా స్పందించటమే కాకుండా.. శాస్త్రీయంగా లెక్క తేల్చేలా తీసుకున్న నిర్ణయం టైమ్లీగా ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News