జగన్‌ కోడికత్తి కేసును విచారిస్తున్న న్యాయమూర్తి కడపకు బదిలీ!

Update: 2023-04-19 11:00 GMT
2018లో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న విజయవాడ ఎంఎస్‌జే కోర్టు/రెండో ఏడీజే న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయమూర్తిని అక్కడ నుంచి తప్పించి కడపకు బదిలీ చేశారు. ఆయన ప్రస్తుతం విజయవాడలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా ఉన్నారు. శ్రీనివాస ఆంజనేయ మూర్తిని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆయన స్థానంలో విజయవాడ మూడో ఏడీజే కోర్టు జడ్జి ఎ.సత్యానంద్‌ వచ్చారు.

కాగా ప్రస్తుతం జగన్‌ పై కోడి కత్తితో దాడి చేసిన కేసు విజయవాడలోని ఎన్‌ఐ కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా జగన్‌ పై దాడికి సంబంధించి కుట్ర కోణం ఏమీ లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చింది. ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించింది.

ఇక ఈ కేసులో దర్యాప్తు చేయడానికి ఏమీ లేదని తెలిపింది. జగన్‌ పై దాడి చేస్తే ఆయనకు సానుభూతి వస్తుందనే దాడి చేశానని నిందితుడు తెలిపాడని పేర్కొంది. టీడీపీ నేతలకో, మరొకరికో జగన్‌ పై దాడి కేసుతో సంబంధం లేదని ఎన్‌ఐఏ తేల్చింది. అన్ని అంశాలను పరిశీలించామని.. ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని కోర్టుకు నివేదించింది.

కాగా జిల్లా న్యాయమూర్తులు, సెషన్స్‌ కోర్టుల జడ్జిల బదిలీలకు సంబంధించి మూడు జిల్లాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తులను (పీడీజే) నియమిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌)గా పనిచేస్తున్న గంధం సునీతను తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా నియమించింది.

హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌)గా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్‌ ను విశాఖపట్నం పీడీజేగా బదిలీ చేసింది. విశాఖ పీడీజేగా పనిచేస్తున్న జి.గోపిని విశాఖలోని ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమించారు.

అదే విధంగా విశాఖలోని ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ గా జి.శ్రీదేవి అనంతపురం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. అనంతపురం ఫ్యామిలీ కోర్టు జడ్జి తిరుమలరావును గుంటూరులోని ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ గా నియమించారు.

అనంతపురం మొదటి ఏడీజే ఎస్‌.రమేశ్‌ చిత్తూరు మొదటి ఏడీజేగా, అనంతపురం ఆరో ఏడీజే జి.కబర్ధి నెల్లూరు మెదటి ఏడీజేగా, నెల్లూరు మొదటి ఏడీజే సి.సత్యవాణి నెల్లూరు రెండో ఏడీజే/ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా, రాజమహేంద్రవరం మొదటి ఏడీజే కె.సునీత విజయవాడ కోపరేటివ్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా బదిలీ అయ్యారు. అలాగే మరికొంతమందిని కూడా బదిలీ చేశారు.

Similar News