జగన్ కెసిఆర్ భేటీలో ఎం మాట్లాడుకున్నారు?

Update: 2019-08-01 10:48 GMT
కొన్ని గంటల వ్యవధిలో (గురువారం రాత్రి) విదేశీ పర్యటనకు వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా హైదరాబాద్ కు వచ్చారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లిన జగన్.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. కాసేపు అక్కడే ఉన్న ఆయన.. తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లారు. జగన్ రాక నేపథ్యంలో ఇంటి బయటకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురెళ్లి మరీ జగన్ కు స్వాగతం పలికారు.

అనంతరం ఇరువురు సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మర్యాదపూర్వకంగా చెబుతున్నప్పటికీ.. ఇద్దరి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. గతంలో తామిద్దరం చర్చించిన అంశాల్లో పురోగతి ఏ మేరకు వచ్చిందన్న విషయాన్ని ఇరువురు సీఎంలు చర్చించే వీలుందన్న మాట వినిపిస్తోంది.

నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్న వేళ.. హైదరాబాద్ కు వచ్చిన ఆయన.. తనకున్న కాస్త సమయంలోనూ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ తో భేటీ కావటం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఇష్యూలను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నంచేస్తున్నారని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల పరిష్కారం మీద ఈ నెల 8న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమక్షంలో కీలక సమావేశం జరగనుంది. దీనికి ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరు కానున్నారు. దానికి ముందే.. కీలక అంశాల విషయంలో చర్చలు జరపటం ద్వారా.. విభేదాల్ని వీలైనంత త్వరగా ముగిద్దామన్న ఆలోచనలో ఇద్దరుసీఎంలు ఉన్నట్లుగా తెలుస్తోంది.



Tags:    

Similar News