కాలు కదపకుండానే కదనరంగాన జగన్... ?

Update: 2021-10-02 02:30 GMT
జగన్ ది మాస్టర్ మైండ్. జగన్ కి పొలిటికల్  గ్లామర్ ఉంది, గ్రామర్ కూడా ఉంది. ఆయనలో మంచి వ్యూహకర్త ఉన్నారు. లేకపోతే బలమైన కేంద్రాన్ని అంతకంటే బలమైన సోనియా గాంధీని  ఢీ కొట్టే గుండె ధైర్యం ఎలా వస్తుంది. మొత్తానికి చూసుకుంటే జగన్ పొలిటికల్ ఎంట్రీ నుంచే మంచి దూకుడుగా ఉన్నారని అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే జగన్ సొంతంగా పార్టీ పెట్టి కేంద్రంలోని సోనియా గాంధీని, ఆమె పార్టీని ఓడించేశాక ఏపీలో చంద్రబాబుకు కూడా సింహ స్వప్నం అయ్యారు. ఆయన అది లగాయితూ తనదైన రాజకీయ  చాణక్యాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబుకు ఎప్పటికపుడు దెబ్బకొడుతూనే ఉన్నారు.  2014 ఎన్నికల్లో చంద్రబాబు పొత్తులతో వస్తే జగన్ సింగిల్ గానే వచ్చారు. ఇక ఆనాడు  అందరూ కలసినా కూడా జగన్ కి టీడీపీ కూటమికి మధ్య ఓట్ల తేడా అచ్చంగా అయిదు లక్షల ఓట్లు మాత్రమే.

దానికి ఇంతకు ఇంత అన్నట్లుగా 151 సీట్లు 51 శాతం ఓట్ల షేర్ తో జగన్ 2019 ఎన్నికలలో కసిగా గెలిచి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆ తరువాత ఆయన ఎన్నికల ప్రచారానికి రాకుండా తాడేపల్లిలోనే ఉంటూ వ్యూహాలను రచిస్తూ వస్తున్నారు. చంద్రబాబు అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో బాగా తిరిగారు. పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఏకంగా మ్యానిఫేస్టోని రిలీజ్ చేసి విమర్శల పాలు అయ్యారు. ఇక మునిసిపల్ ఎన్నికల్లో అయితే అటు బాబు ఇటు చినబాబు కూడా ఏపీని అంతా చుట్టేశారు. అయినా ఫలితం మాత్రం పెద్ద తేడా లేదు. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అయితే చంద్రబాబు ఆయన పరివారం అక్కడే మకాం వేసి మొత్తం ప్రచారాన్ని నెల రోజుల పాటు హోరెత్తించారు. అయినా కూడా గతం కంటే ఎక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి గెలిచారు, ఎంచక్కా ఎంపీ అయిపోయారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ వస్తారని అంతా అనుకున్నారు. జగన్ మీటింగ్ షెడ్యూల్ కూడా ఖరార్ చేశారు. కానీ కరోనా కారణంగా చివరి నిముషంలో అది రద్దు అయింది. ఇక ఇపుడు చూస్తే బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఉంది. బద్వేల్ ఉన్నది కడప జిల్లాలో. అంటే జగన్ సొంత ఇలాకాలో. మరి జగన్ ఈసారి ప్రచారానికి వస్తారా అంటే లేదు అన్న మాటే వినిపిస్తోంది. జగన్ అసలు బయటకు రారు అంటున్నారు. ఆయన సూచనలు మారగదర్శకాలతోనే బద్వేల్ ఉప ఎన్నికల సమరం గట్టిగానే  మొదలైపోయింది. చిత్తూరు జిల్లాలో మొత్తానికి మొత్తం టీడీపీని బదనాం చేసిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఎన్నికల  బాధ్యుడు. ఆయనకే కీలకమైన బాధ్యతలను జగన్ అప్పగించారు. అంతే కాదు ఎమ్మెల్యేలను మండలాలకు ఇంచార్జిగా నియమించారు. దాంతో ఇక ఎన్నికల యుద్ధం అయితే వైసీపీ పక్షాన మొదలైపోయింది.

ఈసారి మెజారిటీ మీదనే వైసీపీ దృష్టి అంతా అంటున్నారు. 2019 ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్ధిగా దిగిన వెంకట సుబ్బయ్య 44 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో లక్ష ఓట్లను ఆయన రాబట్టారు. ఇపుడు దాన్ని మించి అంటే ఈసారి అర లక్షకు పైగా మెజారిటీ తీసుకురావాలని వైసీపీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అదే సమయంలో  గత ఎన్నికల్లో  యాభై వేల దాకా ఓట్లు తెచ్చుకున్న టీడీపీని ఇంకా తగ్గించడానికి కూడా రంగం సిద్ధం అవుతోంది. అంటే జగన్ చాణక్య రాజకీయంతో మరో మారు బద్వేల్ లో టీడీపీ బదనాం కావడం ఖాయమని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే చంద్రబాబు ప్రచారానికి వస్తారా అన్నది చూడాలి.  అక్కడ ఎవరు ప్రచారం చేసినా కూడా ఫలితం ఏంటో ముందే తేలిపోతున్న నేపధ్యం ఉంది. సో టీడీపీ కూడా జాగ్రత్తగానే ఇవన్నీ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు  జనసేన బీజేపీ కాంబో నుంచి జనసేన ఈసారి బరిలో ఉంటుంది అంటున్నారు. మరి చూడబోతే బద్వేల్ లో పవన్ జోరుగా తిరిగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇక ఎవరు వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం పక్కా క్లారిటీగా ఉంది. జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటి రారంటే రారు. అక్కడ నుంచే మొత్తం కధ నడుపుతారు. అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అవుతారు అంటున్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News