ముద్రగడ..వైఎస్సార్సీపీలోకి? ఆ పదవి ఖాయమా?

Update: 2019-06-05 06:03 GMT
కాపు రిజర్వేషన్ల ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం గత కొన్నాళ్లుగా రాజకీయంగా అచేతనంగా మారిన సంగతి తెలిసిందే. కీలకమైన ఎన్నికల ముందు ఆయన రాజకీయంగా కామ్ అయిపోయారు. అంతకు ముందు కాపు రిజర్వేషన్ల ఉద్యంతో అట్టుడికించి కూడా ఆ తర్వాత ఎన్నికల సమయానికి ముద్రగడ ఏం మాట్లాడలేదు. అంతకు ముందు ఆయన పలు పార్టీలతో సంప్రదింపులు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ముద్రగడ ఏ పార్టీలోనూ చేరలేదు. ఎన్నికలు రానే వచ్చాయి - వెళ్లిపోయాయి.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా మార్చేశాయి ఈ ఎన్నికలు. ఇక ఎన్నికల తర్వాత ముద్రగడకు రాజకీయంగా  ప్రాధాన్యత చాలా వరకూ తగ్గిపోయినట్టే. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనకు తన పార్టీలోకి స్వాగతం పలుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కొన్ని సార్లు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు ముద్రగడ. ప్రత్యేకించి కాపు రిజర్వేషన్ల అంశంలో తన చేతిలో ఏమీ లేదని - ఆ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటేనే జరుగుతుందని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో జగన్ మీద ముద్రగడ విమర్శలు చేశారు కూడా. అయినా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ కాపు నేతకు మంచి గుర్తింపు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట.

అందులో భాగంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ముద్రగడకు ఆఫర్ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ఆయనను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా కాపు కార్పొరేషన్ పదవిని ఆఫర్ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి - ముందు ముందు ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా హామీగా ఇస్తున్నారట.

ఈ ఆఫర్లతో ముద్రగడ పద్మనాభాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి దీనిపై ముందు ముందు ఎలాంటి అప్ డేట్స్ ఉంటాయో!
Tags:    

Similar News