పోలవరం రివర్స్ టెండరింగ్..ఒక్క పనిలోనే 42 కోట్లు ఆదా

Update: 2019-09-20 16:00 GMT
పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో ఎన్ని విమర్శలొచ్చినా - ఒత్తిళ్లొచ్చినా వెనక్కు తగ్గకుండా తాను అనుకున్నట్లుగా ముందుకు సాగిన ఏపీ సీఎం జగన్ తొలి ప్రయత్నంలో రూ.42 కోట్లు ఆదా చేశారు.  పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజికి దాఖలైన టెండర్లు 15.6 లెస్ కు ఖరారయ్యాయి. మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థకు ఈ పనులు దక్కాయి. గతంలో ఇదే సంస్థ 4.8 శాతం ఎక్కువకు టెండర్ వేయగా ఇప్పుడు 15.6 శాతం తక్కువకు వేసి ఖరారు చేసుకుంది.

గతంలో ఈ పనులను రూ. 292.09 కోట్లకు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో రూ. 231.47 కోట్లకు అవే పనులను సొంతం చేసుకుంది. ఈ పనుల ప్రారంభ బెంచ్ మార్క్ విలువ రూ. 274.55 కోట్లు కావడంతో ప్రభుత్వానికి రూ.42.08 కోట్లు ఆదా అయింది. అదే పాత టెండర్ల లెక్కన చూస్తే రూ.61 కోట్లు ఆదా అయినట్లు.

ఈ పనులను దక్కించుకునేందుకు మొత్తం 6 సంస్థలు పోటీ పడ్డాయి. ఇక ఈ నెల 23న పోలవరం హెడ్ వర్క్స్  - స్పిల్ ఛానల్ - ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులకు రివర్స్ టెండరింగ్ జరగనుంది. ఈ-ఆక్షన్ రెండు గంటల 45 నిమిషాల పాటు సాగింది.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో చేపట్టిన పనులను సమీక్షించడంతో పాటు పోలవరం టెండర్లను కూడా మళ్లీ పిలుస్తామని.. గతంలో అడ్డగోలుగా దోచిపెట్టారని చెప్పారు. అయితే, రివర్స్ టెండరింగ్ వద్దంటూ విపక్షాలు విమర్శించడంతో పాటు అన్నిరకాలుగా ఒత్తిడి చేశాయి. అయినా జగన్ వెరవకుండా రివర్స్ టెండరింగ్ చేపట్టగా తొలి వేలంలోనే రూ.42 కోట్లు మిగిలాయి.

   

Tags:    

Similar News