రాజ్య‌స‌భ హామీలు!..జ‌గ‌న్‌ ను ఇబ్బంది పెట్టేస్తాయా?

Update: 2019-05-12 09:21 GMT
ఏపీలో ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసింది. పోలింగ్ స‌ర‌ళిని నిశితంగానే ప‌రిశీలించిన విప‌క్ష వైసీపీ... ఈ ద‌ఫా త‌మ విజ‌యం ఖాయ‌మేన‌ని గ‌ట్టి ధీమాతోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో త‌మ‌దే హవా అన్న భావ‌న ఆ పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. క్రితం సారి త్రుటిలో త‌ప్పిన అధికారం ఈ ద‌ఫా త‌ప్ప‌కుండా అందుతుంద‌ని - త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కావడం ఖాయ‌మేన‌ని కూడా ఆ పార్టీ నేత‌ల‌తో పాటు మెజారిటీ ప్ర‌జ‌లు కూడా గ‌ట్టిగానే న‌మ్ముతున్నారు. జ‌గ‌న్ అధికకారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌... చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయ‌నే చెప్పాలి. వీటిలో కొన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం జ‌గ‌న్ ను ఓ ఎత్తుకు తీసుకెళితే... మ‌రికొన్ని స‌మ‌స్య‌లు జ‌గ‌న్ ను బాగానే ఇబ్బంది పెట్ట‌డం ఖాయ‌మేన విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇలాంటి క్లిష్ట స‌మ‌స్య‌ల్లో రాజ్య‌స‌భ సీట్ల పంపిణీ ప్ర‌ధాన‌మైన‌దిగా చెప్పుకోవాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీగా ఉన్న త‌న బాబాయి వైవీ సుబ్బారెడ్డి - నెల్లూరు ఎంపీగా ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిల‌కు జ‌గ‌న్ ఈ ద‌ఫా టికెట్లు ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. చివ‌రి నిమిషంలో పార్టీలో చేరిన మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డికి ఒంగోలు టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌... ఆదాల ప్ర‌భాకర్ రెడ్డికి నెల్లూరు టికెట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వైరి వ‌ర్గం వ్యూహాల‌ను బ‌ద్ద‌లు కొట్టేలా జ‌గ‌న్ ఈ వ్యూహం ర‌చించినా... వైవీ - మేక‌పాటిల‌కు టికెట్లు ఇవ్వ‌డం సాహ‌సోపేత నిర్ణ‌య‌మే క‌దా. ఈ నిర్ణ‌యం తీసుకునే ముందు... ఎన్నిక‌లు ముగిసి మ‌నం అధికారంలోకి రాగానే వారిద్ద‌రికీ రాజ్య స‌భ సీట్ల హామీ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ మ‌హిళా నేత‌ - మాజీ ఎంపీ కిల్లి కృపారాణి కూడా చివ‌రి నిమిషంలో పార్టీలో చేరారు క‌దా. ఆమెకు కూడా జ‌గ‌న్ టికెట్ అయితే ఇవ్వ‌లేదు. ఎన్నిక‌లు ముగిసి అధికారంలోకి రాగానే రాజ్య‌స‌భ గానీ - ఎమ్మెల్సీగా కానీ అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చార‌ట‌. ఇక అమ‌లాపురం సిట్టింగ్ ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు - దాడి వీర‌భ‌ద్రారావు లాంటి నేత‌ల‌తో పాటు టీడీపీ వ‌ల‌కు చిక్కిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి సొంత గూటికి చేరారు. వీరికి కూడా ఏదో ఒక ర‌కంగా సంతృప్తి ప‌ర‌చక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇప్ప‌టికే వైసీపీ త‌ర‌ఫున ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులున్నారు. రేపు ఏపీలో మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు ద‌క్కించుకున్నా... వైసీపీకి ల‌భించే రాజ్య‌స‌భ సీట్ల‌ను ఒక‌టో, రెండో మాత్ర‌మే ఉండే అవ‌కాశాలున్నాయి. మ‌రి ఆశావ‌హుల సంఖ్య చూస్తే చాంతాడంత ఉంది. ఈ నేప‌థ్యంలో నేత‌లంద‌రినీ సంతృప్తిప‌ర‌చ‌డం జ‌గ‌న్ కు క‌త్తి మీద సామేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చూద్దాం మ‌రి... .జ‌గ‌న్ ఈ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మిస్తారో?
Tags:    

Similar News