గిద్ద‌లూరు వైసీపీలో డ‌మ్మీ స‌ర్వే డమ్మీ అభ్య‌ర్థులు

Update: 2016-07-05 05:01 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో న‌డుస్తున్న నాయ‌కులే ఆ పార్టీని బల‌హీన ప‌ర్చే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారా?  త‌మ సొంత ప్ర‌యోజ‌నాల కోసం ఏకంగా డ‌మ్మీ స‌ర్వేల‌కు తెర‌లేపారా? ఈ స‌ర్వేల ద్వారా త‌మ వ‌ర్గానికి చెందిన  వారిని నాయ‌కులుగా తీర్చిదిద్దేందుకు ల‌క్ష్యంగా పెట్టుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా ధన బలంతో వైసీపీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలను అధికార పార్టీ ఏమార్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు వైసీపీ నాయ‌క‌త్వం ఇంచార్జీలను నియ‌మిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయం న‌డుస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి సైకిలెక్కిన క్ర‌మంలో వైసీపీని బ‌లోపేతం చేసేందుకు ఓ సీనియ‌ర్ నాయ‌కుడు పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అయితే అదే జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి రంగంలోకి దిగి చ‌క్రం తిప్పుతున్న‌ట్లు స‌మాచారం. పార్టీ భవిష్యత్తును పక్కనెట్టి త‌న ఆధిప‌త్యం నెగ్గేలా చేగిరెడ్డి లింగారెడ్డి (ఈయనకు 70 ఏళ్లు) అనే మ‌రో నేత‌ను తెర‌మీద‌కు తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన చేగిరెడ్డికి లేని బలాన్ని కూడగట్టేందుకు డమ్మీ సర్వేతో మాయ చేసే ప్రయత్నం చేశారు. క్షేత్ర‌స్థాయిలో చేసిన స‌ర్వే కాకుండా త‌నే ఓ స‌ర్వే చేసినట్లు కాగితాలు సృష్టించి వైసీపీకి చెందిన‌ జిల్లా ముఖ్యనేత వద్ద బ్రహ్మాండమైన మార్కులు వేయించుకుని పార్టీ ఆఫీసుకు పంపించారు. విచిత్రం ఏంటంటే లింగారెడ్డి సోద‌రుడు ఎంపీటీసీగా కూడా ఓడిపోయారు. దీన్ని బట్టి ఆ కుటుంబానికి ఉన్న రాజకీయాదరణ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాకుండా చేగిరెడ్డి అనుచ‌ర‌వ‌ర్గ‌మంతా టీడీపీలోకి వెళితే లింగారెడ్డి రావ‌డం వ‌ల్ల పార్టీకి ప్ర‌యోజ‌నం ఏముంటందన్నది బ్రహ్మపదార్థం.

నియోజకవర్గంలో ఇలా ఉండగా... జగన్ మాత్రం ఇప్పటికే ఆ నియోజకవర్గానికి ఐవీ రెడ్డి అనే ఎన్నారైను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. యువకుడు - అధికారంపై వ్యామోహంతో కాకుండా రాజకీయాలపై ఆసక్తితో అడుగుపెట్టి గత కొన్నేళ్లుగా సామాజిక కార్యక్రమాలు చేయడం ద్వారా జగన్ సర్వేల్లో అతనికి మార్కులు పడినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ప‌రిణామాలపై రాష్ట్ర పార్టీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీని బ‌లోపేతం చేయాల‌నే ఏకైక‌ టార్గెట్‌ తో జ‌గ‌న్ ముందుకు వెళుతున్నార‌ని అంటున్నారు. ఇందులో భాగంగా కేవలం ఆర్థికంగా బ‌లంగా ఉన్న‌వారిని కాకుండా, నాయ‌కుల‌ను ఒక తాటిపై న‌డిపించిగ‌ల వారిని...వీట‌న్నింటికంటే ముఖ్యంగా యువ‌కుల‌కే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏమైనా క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు - నాయ‌కుల బ‌లాబ‌లాలు అంచనా వేసి ఎంపిక ఉంటేనే పార్టీకి భవిష్యత్తు అని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ​
Tags:    

Similar News