అసెంబ్లీలో జగన్ చూడకూడని ముఖాలు...?

Update: 2022-08-06 13:39 GMT
ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మద్దతుగా జనసేన నుంచి గెలిచిన ఒకరు వెనకాల వచ్చారు. అలాగే తెలుగుదేశం నుంచి చూస్తే మరో నలుగురు వైసీపీతోనే ఉన్నారు. అంటే 156 మంది సభ్యులతో మొత్తం 175 మంది ఉన్న ఏపీ అసెంబ్లీలో రారాజుగా ఈ రోజుకు వైసీపీ ఉంది అన్న మాట. ఇక మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న వేళ ఆనాటి పరిస్థితి ఏంటి అన్న చర్చ అపుడే మొదలైంది.

ఏపీలో కొందరు కీలకమైన విపక్ష  నాయకులను అసెంబ్లీలో 2024 తరువాత  చూడకూడదని జగన్ చాలా గట్టిగానే  అనుకుంటున్నారుట. వారిలో ఫస్ట్ పేరు ఎవరిదో అందరికీ తెలిసిందే. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు. బాబును ఈసారి కుప్పంలో ఓడించినట్లు అయితే ఆయన అసెంబ్లీకి రాలేరు అని జగన్ గట్టిగా భావిస్తున్నారు. బాబుని ఓడించాలని ఆయన పదే పదే అంటున్నది అందుకే అని చెబుతున్నారు. అలాగే కుప్పం విషయాన్ని ఈసారి వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక బాబు తరువాత మరో చూడకూడని ముఖం లోకేష్ అని అంటున్నారు. లోకేష్ మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. గతం కంటే ఆయనకు అక్కడ  ఆదరణ బాగా పెరిగింది అని వైసీపీ చేయించుకున్న నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయట. దాంతో లోకేష్ ని ఎలాగైనా ఓడించాలన్న జగన్ పంతం ఈసారి ఏ కొత్త స్ట్రాటజీని అనుసరిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.

మంగళగిరిలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. దాంతో అవసరం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని వెనక్కి నెట్టి బీసీ కార్డుతో ముందుకు రావాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఈసారి పకడ్బంధీ వ్యూహాన్ని రచించి అయినా లోకేష్ ని అసెంబ్లీ ముఖం చూడకుండా చేయాలన్న టార్గెట్ కూడా ఉందిట.

ఇక మూడవ పేరు ముచ్చట గొలిపేదే. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఎవరికీ తెలియడంలేదు. ఆయన చేస్తే గోదావరి జిల్లాలలోనే చేస్తారు అని టాక్ ఉంది. అలాగే తిరుపతి నుంచి కూడా పోటీ పడతారు అని చెబుతున్నారు. అయితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా గట్టిగా శ్రమించైనా ఓడించాలన్నది వైసీపీ ఆలోచనగా ఉందిట. దాని కోసం ఈసారి కూడా ప్రత్యేక దృష్టిని కూడా పెడతారు అని అంటున్నారు.

ఇక నాలుగవ పేరు ఉంది. అదే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. ఈయనది టెక్కలి నియోజకవర్గం, శ్రీకాకుళంలో బలంగా పాతుకుపోయిన కింజరాపు ఫ్యామిలీని ఈసారి రాజకీయంగా ఓడించాలన్నదే జగన్ పంతం అని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు జగన్ మీద పెద్ద నోరుతో అసెంబ్లీలో మాట్లాడుతారు. అందువల్ల ఆయన్ని రానీయకుండా చేస్తేనే అదే  అసలైన గెలుపు అని జగన్ భావిస్తున్నారు అని చెబుతున్నారు.

చివరిగా మరో పేరు ఉంది. అదే రాజమండ్రీ రూరల్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ఆయన సోషల్ మీడియా ద్వారా జగన్ సర్కార్ కి ఏకి పారేస్తున్నారుట. అందువల్ల ఈ పెద్దాయనను మాజీని చేయడం ద్వారా అసెంబ్లీ ముఖం చూడనీయకూడదు అని జగన్ తలపోస్తున్నారు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ అయిదుగురి మీద జగన్ గురి ఉంటుంది అని చెబుతున్నారు. ఇవన్నీ సరే కానీ వీరిని ఓడించడం జరిగే పనేనా అన్న చర్చ కూడా ఉంది.

ఎన్నికల్లో ఎవరినైనా గెలిపించాలన్నా ఓడించాలన్నా జనాల మద్దతు కావాలి. వారు కోరుకున్న వారే ఎమ్మెల్యే అవుతారు. మరి జనాల మద్దతు ఈసారి వైసీపీకి గతంతో పోలిస్తే బాగా తగ్గుతుంది అంటున్న నేపధ్యంలో ఇంతమంది కీలక నేతలను ఓడించాలనుకోవడంలో అతి ఎక్కువగానే ఉంది అంటున్నారు. అయినా ఆశ రాజకీయాలకు శ్వాస. కాబట్టి జగన్ తలచుకోవడంలో తప్పులేదు, పరిశ్రమించడంలోనూ తప్పులేదు. ఫలితం మాత్రం ఆయన చేతుల్లో లేదు. అది జనాలు ఇచ్చే తీర్పు లో ఉంది. సో తమ్ముళ్ళు ఏమీ కంగారు పడాల్సింది లేదు అంటున్నారు.
Tags:    

Similar News