జగన్, ఆర్‌ఆర్‌ఆర్‌.. తృటిలో తప్పిపోయిన అరుదైన సన్నివేశం!

Update: 2022-11-16 09:51 GMT
సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పద్మాలయ స్టూడియోకి వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్‌తోపాటు ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు ఉన్నారు. అంతకుముందే ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. సూపర్‌స్టార్‌కు నివాళులు అర్పించి వెళ్లిపోయారు.

కాగా జగన్‌ పద్మాలయ స్టూడియోకి వచ్చినప్పుడు కొన్ని అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అదే సమయంలో అక్కడ ప్రముఖ సినీ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ సైతం అక్కడే ఉన్నారు.

అయితే సీఎం జగన్‌ తనంతట తానుగా గల్లా జయదేవ్‌ను పలకరించి ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకోవడం గమనార్హం. గల్లా జయదేవ్‌కు చెందిన అమర్‌రాజా బ్యాటరీస్‌ కాలుష్యం వెదజల్లుతోందని జగన్‌ ప్రభుత్వం దానికి సీల్‌ వేయించిన సంగతి తెలిసిందే. దీనిపై జయదేవ్‌ హైకోర్టుకు కూడా వెళ్లారు. అంతేకాకుండా తాను కొత్తగా స్థాపించాలనుకున్న మరో యూనిట్‌ను ఏకంగా తమిళనాడుకు తరలించేశారు. ఇలా ఉప్పునిప్పుగా ఉన్నప్పటికీ జగన్, జయదేవ్‌ మధ్య మాటలు చోటు చేసుకోవడం విశేషం.

ఇక వైసీపీ రెబల్‌ ఎంపీ, ఆర్‌ఆర్‌ఆర్‌గా ముద్రపడ్డ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా జగన్‌ వచ్చే వరకు బాలకృష్ణ, తదితరులతో కృష్ణ పార్థిక దేహం వద్దే ఉన్నారు. జస్ట్‌ సీఎం జగన్‌ వచ్చే కొద్ది క్షణాల ముందే రఘురామకృష్ణరాజు బయటకు వెళ్లారు.

జగన్‌ వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు అక్కడే ఉండి ఉంటే వీరిద్దరి మధ్య మాటలు చోటు చేసుకునేవా.. మర్యాదపూర్వకంగా అయినా నమస్కరించుకోవడం చేసేవారా.. చేస్తే ముందు ఎవరు చేసేవారు.. లేదంటే ఎవరు పలకరించేవారు వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లేకపోతే అసలు ఎవరికి వారు పట్టించుకోనట్టు ఉండిపోయేవారా అనేదానిపై కూడా నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత కొద్ది కాలానికే వైసీపీ రెబల్‌ ఎంపీగా మారారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీతో కేసు నమోదు చేయించింది. అంతేకాకుండా ఆయనను అరెస్టు చేసి పోలీసులతో కొట్టించిందనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి.

మరోవైపు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా రఘురామకృష్ణరాజును రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుందనే విమర్శలు వచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల నడుమ కృష్ణ పార్థివ దేహం వద్ద జగన్, ఆర్‌ఆర్‌ఆర్‌ కలిసే అరుదైన సన్నివేశం తృటిలో మిస్‌ అయ్యింది. బాలకృష్ణతో గల్లా జయదేవ్‌తోపాటు రఘురామ కూడా అక్కడే ఉండి ఉంటే ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమై ఉండేదనే చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News