ఏం చెప్పారు: పత్రికల పని పత్రికలు చేస్తాయంట

Update: 2015-03-17 10:14 GMT
ఈ రోజు వైఎస్‌ జగన్‌ అద్భుతమైన మాట ఒకటి చెప్పారు. అక్షర లక్షలు విలువ చేసే సందేశాన్ని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చేశారు. పోలవరానికి చంద్రగ్రహణం పేరిట సాక్షి పత్రికలో ఒక కథనాన్ని అచ్చేసింది.

మిగిలిన మీడియా సంస్థలకు.. సాక్షికి ఓ పెద్ద వ్యత్యాసం ఉంది. మిగిలిన పత్రికల మీద.. ఆయా పార్టీలకు అనుకూలం అన్న ముద్ర ఉంటే.. సాక్షి మాత్రం ఏకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సొంత పత్రిక. ఈ నేపథ్యంలో మిగిలిన పత్రికల మాదిరి.. సాక్షిని జత కట్టే పరిస్థితి లేదు. ఇక.. ఈ రోజు అచ్చేసిన కథనంపై ఏపీ అధికారపక్షం విరుచుకుపడింది.

అసత్యాలతో కథనాన్ని వండి వార్చారని.. ఆ కథనంలోని అంశాలపై నిజానిజాలు చర్చిద్దామంటూ సవాలు విసిరారు. ఆ కథనంపై క్షమాపణలు చెప్పిన తర్వాత మాట్లాడాలని అధికారపక్ష నేతలు నిలదీశారు. ఈ నేపథ్యంలో జగన్‌ కూల్‌ గా రియాక్ట్‌ అవుతూ.. ఈనాడు.. ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా వందలాది కథనాలు వస్తాయని.. అలాంటిదే సాక్షిలో వచ్చిన కథనమని గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో ఆయన అధికార పక్షానికి ఒళ్లు మండిపోయేలా.. పత్రికల పని పత్రికలు చేస్తాయి.. మన పని మనం చేద్దామంటూ వ్యాఖ్య చేయటంతో తమ్ముళ్లకు కాలిపోయింది. మిగిలిన పత్రికల్లో వచ్చే కథనాలకు.. జగన్‌ బాబు సొంతపత్రికకు తేడా ఉండదా? మొత్తానికి తన మాటలతో జగన్‌ అధికారపక్షానికి ఇరిటేషన్‌ తెచ్చారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News