మోడీపై జ‌గ‌న్ ఆగ్ర‌హం..వినిపిస్తోందా తెలుగు త‌మ్ముళ్లు!

Update: 2019-02-02 05:17 GMT
మోడీ.. జ‌గ‌న్ కుమ్మ‌క్క‌య్యారు. నిత్యం తెలుగు త‌మ్ముళ్ల నోట వినిపించే మాట ఇది. అందుకు సాక్ష్యంగా.. చూశారా జ‌గ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఒక్క విమ‌ర్శ చేయ‌లేదు?  నిజంగా ఆయ‌న మోడీకి సానుకూలం కాకుంటే ఇప్ప‌టికి తీవ్ర వ్యాఖ్య‌లు చేసే వారు క‌దా? అంటూ ట‌న్నుల ట‌న్నులుగా ఉన్న త‌మ తెలివిని బ‌య‌ట‌పెట్టే ప‌ని చేస్తుంటారు ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు.

తాజాగా మోడీ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై జ‌గ‌న్ స్పంద‌న చూసిన‌ప్పుడు.. ఆయ‌న‌కు.. ప్ర‌ధానికి మ‌ధ్య లాలూచీ ఉందా?  లేదా? అన్న విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి జ‌గ‌న్ ఫైర్ కావ‌ట‌మే కాదు.. ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు త‌మ్ముళ్లు ఆరోపించిన‌ట్లుగా మోడీతో సంబంధాలు ఉన్నా.. తెర వెనుక ఒప్పందాలు ఉండి ఉంటే.. ఇంత తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌టం సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఇంత‌కీ మోడీ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందిస్తూ.. నాలుగు నెల‌ల‌కు ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ లో వ‌రాలు.. ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించ‌టాన్ని ప్ర‌లోభం పెట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లేన‌ని చెప్పారు. మోడీ స‌ర్కారు తీరు చూస్తే ప్ర‌జ‌ల్ని మోసం చేసిన‌ట్లేన‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌జ‌ల్ని మోసం చేయ‌టంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్రంలోని పెద్ద‌లు పీహెచ్ డీ తీసుకున్నార‌న్నారు. మోడీ స‌ర్కార్ చివ‌రి బ‌డ్జెట్‌ లోనూ ఏపీకి ఏమీ లేవని..  రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చేత‌కానివాడైతే.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఎలా దెబ్బ తింటాయో చెప్ప‌టానికి చంద్ర‌బాబు పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు. ఓటుకు నోటు కేసు అనంత‌రం బాబు త‌గ్గ‌టంతోనే ఇలాంటి పరిస్థితి వ‌చ్చింద‌న్నారు.

ప్ర‌త్యేక హోదాను వ‌దిలేసి ప్యాకేజీకి ఓకే చెప్పార‌ని.. కేంద్ర‌ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో నాలుగుసార్లు తీర్మానాలు చేయ‌టాన్ని గుర్తు చేశారు. కేంద్ర బ‌డ్జెట్‌ లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయానికి నిద‌ర్శ‌నంగా న‌ల్ల చొక్కాలు వేసుకొని వ‌స్తే.. త‌మ‌ను నానా మాట‌లు అన్న చంద్ర‌బాబు.. ఈ రోజు న‌ల్ల చొక్కాలు వేసుకురావ‌టం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించారు.

హోదాను వ‌దిలేసి.. ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టిన వేళ‌.. తాను నిర‌స‌న వ్య‌క్తం చేసేందుకు అసెంబ్లీలో 30 సెక‌న్లు కూడా టైమివ్వ‌లేదన్న విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌త్యేక హోదాపై గొంతు ఎత్తినందుకు త‌మ ఎమ్మెల్యుల‌పై ప్రివిలైజ్ నోటీసులు ఇవ్వ‌టాన్ని మ‌ర‌వ‌కూడ‌ద‌న్నారు. హ‌త్య చేసినోడు ఆ హ‌త్య‌కు వ్య‌తిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అసెంబ్లీలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. హోదాకు కేంద్రం మోసం చేసింద‌ని చెప్ప‌టంలో అర్థం లేదంటూ మండిప‌డ్డారు. మోడీ మీద ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ర‌ని.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని వేలెత్తి చూపించేలా జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు
Tags:    

Similar News