ప్రైవేటు లే అవుట్లలో వాటా...జగన్ షాకింగ్ నిర్ణయం!?

Update: 2021-12-07 05:33 GMT
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ దెబ్బకు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిపుడే కోలుకుంటున్న ఏపీలో తాజాగా ఒమిక్రాన్ భయంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక, గత రెండున్నరేళ్లుగా ఏపీలో ఇసుక కొరత, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటి పలు కారణాలతో నిర్మాణ రంగం కుదేలైందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడిపుడే వాటి నుంచి కోలుకొని నిర్మాణ రంగం గాడిన పడుతుండడంతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వారికి షాకిచ్చేలా జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది!. ఇకపై. పట్టణ ప్రాంతాల్లో వేయబోయే లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు చెల్లించాలని సంచలన ఉత్తర్వులను జారీచేసింది!.

ఒకవేళ ఆ లేఅవుట్లలో భూమిని ఇవ్వకుంటే... లేఅవుట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని పేర్కొంది!. అలా కూడా కుదరని పక్షంలో దాని విలువకు సమానమైన డబ్బులు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించింది!.

తాజా జీవో చూసిన తర్వాత రియల్టర్లు, బిల్డర్లు, లే అవుట్లు వేసేవారు లబోదిబోమంటున్నారట. ఇదెక్కడి అన్యాయం జగన్ సార్ అంటూ...వాపోతున్నారట!.

తమ స్వార్జితం నుంచి కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేటు భూములు కొనుక్కొని లే అవుట్లు వేసుకుంటే...అందులో ప్రభుత్వానికి కూడా వాటా కావాలంటే ఎలా అని వాపోతున్నారట. ఇలా అయితే తీవ్ర నష్టాలు వస్తాయని, ఇకపై లే అవుట్లు వేసే పరిస్థితి లేదని బిల్డర్లు, రియల్టర్లు అంటున్నారు.

ఇప్పటికే లే అవుట్లో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు వదిలేయాలన్న నిబంధన ఉంది. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో అది మొత్తం 15 శాతం కాబోతోంది. 5 ఎకరాల్లోపు లేఅవుట్లకు 47.50 శాతం, 5 ఎకరాల పైబడిన లేఅవుట్లకు 49 శాతం భూమిని అదనంగా బిల్డర్లు, రియల్టర్లు వదిలేయాల్సి వస్తుంది.

అయితే, ఆ స్థలాన్ని జగనన్న పేదల ఇళ్ల నిర్మాణం కోసం వినియోగిస్తామని జీవోలో పేర్కొంది. కానీ, ఈ స్థలాన్ని లేదా సమాన మొత్తంలో నగదును రియల్టర్ల నుంచి వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

కానీ, చివరకు ఆ భారం ఫ్లాట్లు కొనేవారిపైనే పడుతుందని, ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం డబ్బు కూడా ప్లాట్లు కొనేవారిపైనే వేస్తారని అంటున్నారు. ఇకపై ఫ్లాట్లు కొనేవారికి పాట్లు తప్పవని చెబుతున్నారు.

లే అవుట్లు వేసే చోట పేదలకు స్థలాలు కేటాయించడానికి దాదాపుగా రియల్టర్లు, ప్లాట్లు కొనేవారు ఇష్టపడకపోవచ్చు. ఇక, ప్రభుత్వానికి వేరే భూమి కొని ఇచ్చేందుకూ సుముఖంగా ఉండకపోవచ్చు.

దీనికి బదులుగా మార్కెట్‌ విలువను లెక్కకట్టి ప్రభుత్వానికి డబ్బు చెల్లించి, ఆ మొత్తం కూడా ప్లాట్లు కొనేవారి నెత్తిన వేయడానికే మొగ్గు చూపవచ్చు. ఈ విధంగానూ ఖజానాను నింపుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News