అమ‌రావ‌తికి మ‌కాం మారుస్తున్న జ‌గ‌న్

Update: 2018-12-27 14:25 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ - లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు మ‌రో 4 నెల‌లే మిగిలి ఉన్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేస్తూ పార్టీ వ‌ర్గాల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండే విధంగా రాజ‌ధాని అమ‌రావ‌తికి త‌న మ‌కాం మారుస్తున్నారు.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్నారు. సుదీర్ఘంగా సాగుతున్న ఈ యాత్ర వ‌చ్చే నెల 6-10 వ తేదీల మ‌ధ్య పూర్తికానుంది. ఇచ్చాపురంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి జ‌గ‌న్ త‌న పాద‌యాత్రను ఘ‌నంగా ముగించ‌నున్నారు. ఆపై జ‌న‌వ‌రి రెండో వారంలోనే రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో పార్టీ కార్యాల‌యాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల స‌మాచారం.

రాజ‌ధాని ప‌రిధిలోని కృష్ణా న‌ది ఒడ్డున తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాల‌యం నిర్మాణం దాదాపుగా పూర్త‌యింది. భ‌వ‌నానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇది కేవ‌లం పార్టీ కార్యాల‌య‌మే కాదు.. జ‌గ‌న్ నివాసంగా కూడా ఉండనుంది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ నివాస‌ముంటున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభానికి ముందే ఆయ‌న అక్క‌డి నుంచే పార్టీ కార్య‌క్ర‌మాలు చూసుకునేవారు. స‌మావేశాలు నిర్వ‌హించేవారు. దీంతో పార్టీ నేత‌లు హైద‌రాబాద్ వెళ్లి ఆయ‌న్ను క‌ల‌వ‌డం క‌ష్టంగా ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ త‌న మ‌కాంను పూర్తిగా అమ‌రావ‌తికి మారుస్తుండ‌టం వైసీపీ శ్రేణుల‌కు, నేత‌లకూ ఊర‌ట‌నిచ్చే విష‌య‌మే. ఇక‌పై వాళ్లు త‌మ అధినేత‌ను క‌లిసేందుకు సుదీర్ఘ ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌బోదు. జ‌గ‌న్ కూడా రాష్ట్రంలో పార్టీ వ్య‌వ‌హారాల‌పై పూర్తిగా దృష్టిసారించేందుకు అమ‌రావ‌తిలో ఆయ‌న నివాసం దోహ‌ద‌ప‌డనుంది.

ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో కాంగ్రెస్‌ - బీజేపీల‌కు పార్టీ కార్యాల‌యాలున్నాయి. రాజ‌ధాని ప‌రిధిలోని చిన‌కాకానిలో జాతీయ ర‌హ‌దారికి ఆనుకొని భారీ కార్యాల‌యాన్ని టీడీపీ నిర్మిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం నిర్మాణం గుంటూరు స‌మీపంలోని కాజాలో శ‌ర‌వేగంగా సాగుతోంది. అదే భ‌వ‌నాన్ని ప‌వ‌న్ త‌న నివాసంగా కూడా ఉప‌యోగించుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా త‌న మ‌కాంను పూర్తిగా అమ‌రావ‌తికి త‌ర‌లిస్తుండ‌టంతో రాజ‌ధాని కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కుతాయ‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు.
Tags:    

Similar News