వైసీపీ లో సౌండ్ బ్యాచ్...వార్ స్టార్ట్ చేసిన జగన్

Update: 2023-06-17 08:00 GMT
వైసీపీ డిఫెన్సివ్ మోడ్ నుంచి అఫెన్సివ్ మోడ్ లోకి వస్తోంది. అన్ని వైపుల నుంచి ప్రతిపక్ష జనాలు వచ్చి మీద పడిపోతూంటే ఘాటైన విమర్శలు చేస్తూ ఉంటే ఇంతకాలం వైసీపీ వాయిస్ ఎక్కడో ఒక చోట అన్నట్లుగా సన్నగా వినిపించేది. కొన్ని సార్లు పెద్ద లీడర్స్ కి మాత్రమే కౌంటర్లు ఉండేవి. అది కూడా అధినాయకత్వం పురమాయింపులతో అని అంటారు.

కానీ ఇపుడు ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది. ఒక వైపు టీడీపీ విమర్శల జోరు పెంచేసింది. తెల్లారి లేచింది మొదలు లోకేష్ బాబు జగన్ మీదనే డైలాగ్ వార్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో వైపు జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏ చిన్న పరిణామం జరిగినా దాన్ని జగన్ తో లింక్ పెట్టి పొలిటికల్ గా సింక్ అయ్యేలా చూసుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా ఫీల్డ్ లోకి దిగిపోయారు. ఆయన వారాహి వాహనం ఎక్కి జగన్ మీద డైరెక్ట్ అటాక్ అంటూ రెడీ అయిపోయారు. ఇలా కీలక నేతలు అంతా జగన్ మీద కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కొత్త శత్రువులా బీజేపీ సిద్ధమవుతోంది. ఒక్క రోజు గ్యాప్ లో జేపీ నడ్డా అమిత్ షా వైసీపీని గుక్క తిప్పుకోనీయకుండా చేశారు.

మరి మాటకు మాట పంచ్ కి పంచ్ అన్నట్లుగా వైసీపీ రెడీ కావడంలో వెనకబడిపోయింది అన్న చర్చ ఉంది. చాలా సార్లు వైసీపీ మీద విమర్శలు జడివానలా కురుస్తున్నా ఎవరికీ పట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే పార్టీ పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుంది అని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. అందుకే అమిత్ షా జేపీ నడ్డాల టూర్లను చూసిన మీదట వారాహి రధమెక్కి పవన్ వస్తున్న సమాచారం గుర్తించిన మీదట తనకంటూ ఒక సౌండ్ బ్యాచ్ ని సిద్ధం చేసి పెట్టుకుంది.

బాగా నోరున్న వారు, మాటకు మాట అప్పచెప్పే వారితో స్టేట్ లెవెల్ లో ఒక పవర్ ఫుల్ టీం ని వైసీపీ రెడీ చేసింది అని అంటున్నారు. ఆ టీం లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారయణ,  రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి,  అలాగే, మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, విడదల రజని, వీరితో పాటుగా ఫైర్ బ్రాండ్ గా  పేరున్న మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని,  అనిల్ కుమార్ యాదవ్ వంటి వారున్నారు.

ఇక ఎమ్మెల్యేలలో చూస్తే భూమన కరుణాకర రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు ఉన్నారు. వీరితోపాటు మరికొంతమందితో కూడిన టీంను సిద్ధం చేస్తున్నారు. వీరందరి పని ఏంటి అంటే ఎప్పటికపుడు విపక్షాలు చేసే కామెంట్స్ కి ప్రతి కామెంట్స్ చేయడం, భారీ కౌంటర్లు ఇవ్వడం. పంచ్ డైలాగులు పేల్చడం, పూర్తిగా అఫెన్సివ్ మోడ్ లో చూసుకుని పోవడం.

ఇప్పటికే ఆ పనిని మాజీ మంత్రి పేర్ని నాని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ స్పీడ్ పెంచేశారు. మునుపటి జోష్ తో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఫీల్డ్ లోకి వచ్చేశారు. ఇక స్టేట్ లెవెల్ లో వీరంతా మాటకు మాట అన్నట్లుగానే కౌంటర్లు ఇస్తారని అంటున్నారు.

ఇదే తీరున జిల్లా స్థాయిలో నోరున్న పేరున్న నేతల జాబితాలను రెడీ చేసి జిల్లాకొక సౌండ్ బ్యాచ్ ని తయారు చేయాలన్నది వైసీపీ ఎత్తుగడగా ఉందిట. ఏ చిన్న విమర్శ వచ్చినా వెంటనే కౌంటర్ ఇవ్వాల్సిందే అన్నదే వైసీపీ హై కమాండ్ ఆదేశం. ఈ విషయంలో ముందు వెనకలు చూసుకోకూడదని, ప్రత్యర్ధి బాణాన్ని నిర్వీర్యం చేయడమే కీలక బాధ్యత అని అంటున్నారు.

దీంతో ఇపుడు ఏపీలో సరికొత్త డైలాగ్ వార్ కి రంగం సిద్ధం అయింది. చంద్రబాబు అండ్ కో ప్రతీ రోజూ పది రకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అలాగే పవన్ లోకేష్ కూడా ఉంటారు. ఇక బీజేపీ కూడా నోరు పెద్దది చేస్తోంది. మరి వీటన్నిటికీ వైసీపీ నుంచి కూడా స్ట్రాంగ్ గా బ్యాండ్ బాజా మోగుతుందన్న మాట. మొత్తానికి ఏపీ రాజకీయం వేడెక్కిపోవడం ఖాయమని అంటున్నారు.

Similar News