టార్గెట్ 175 కుప్పంతో షురు కావాలి సరే.. వీటిని చూడండి జగన్?

Update: 2022-08-05 05:43 GMT
ఆశ ఉండొచ్చు. కానీ.. అత్యాశ అస్సలు ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో బలమైన అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రశ్నించే విపక్షం కూడా ఉండాలన్న మాటను తరచూ చెబుతుంటారు. కానీ.. ఇప్పటిపాలకులకు తాము బలంగా ఉండాలనే కోరుకుంటారే తప్పించి.. బలమైన ప్రతిపక్షం ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వారైతే.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా విపక్షానికి వెళ్లకుండా ఏపీలోని 175సీట్లు తమ పార్టీనే గెలవాలన్న షాకింగ్ ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటారు.

నూటికి నూరు మార్కుల కోసం టార్గెట్ చేసుకోవటం తప్పేలా అవుతుందన్న ప్రశ్నను పలువురు సంధిస్తుంటారు. నిజమే.. నూటికి నూరు శాతం మార్కుల కోసం విద్యార్థులు ప్రయత్నించొచ్చు. కానీ.. అలా సాధించే విద్యార్థి తనకు మాత్రమే రావాలని.. మరెవరికీ రాకూడదని అనుకోవటంలోనే తిప్పలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా ఇప్పుడు అలానే ఉన్నాయని చెప్పాలి.

కానీ.. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో ఇలాంటి మాటలు ఉండొద్దని భావించటం అత్యాశే అవుతుంది. కాబట్టి.. సీఎం జగన్ అభిలాష.. ఆకాంక్ష అయిన 175 స్థానాల్లోనూ తమ పార్టీనే గెలవాలన్న సంకల్పాన్ని తప్పు పట్టలేం. అయితే.. ఈ తరహా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అన్ని అంశాల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో అస్సలు నిర్లక్ష్యం పనికి రాదు. తాజాగా కుప్పం నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. తన అభిలాషను వ్యక్తం చేశారు.

తాను నిర్దేశించిన 175 స్థానాల్లో పార్టీ గెలవాలన్నది కుప్పంతోనే మొదలు కావాలని కోరారు. కుప్పంను తన సొంత నియోజకవర్గంగా చూస్తానని.. తమ పార్టీ అభ్యర్థి భరత్ ను ప్రజలు గెలిపిస్తే..ఆయన్ను మంత్రిని చేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తానని చెప్పిన ఆయన.. రెండు రోజుల వ్యవధిలో రూ.65 కోట్లు విడుదల చేసి.. డెవలప్ మెంట్ పనులు చేయిస్తానని చెప్పారు. ఇంతవరకు అంతా బాగున్నట్లు కనిపించినా.. అసలు విషయాలు మరిన్ని బయటకు వచ్చాయి. కుప్పంకు చెందిన వైసీపీ నేతలు పలువురు తమ అసంత్రప్త రాగాల్ని వినిపించారు.

వైసీపీలో ఉంటూ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటివరకు పదవులు ఇవ్వలేదని వైసీపీ నేత.. మాజీ సర్పంచ్ మురళి ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలో వైసీపీ మొదటి సర్పంచ్ గా గెలుపొందినప్పుడు టీడీపీ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కుప్పం నుంచి కార్యకర్తల్ని పంపాలని జగన్ అడిగితే తాము కుప్పం నుంచి ఛైర్మన్లు.. సర్పంచులు.. ఎంపీటీసీ సభ్యులు.. కౌన్సిలర్లను పంపిన వైనాన్ని గుర్తు చేశారు.

కార్యకర్తలకు న్యాయం జరగకుంటే సీఎం జగన్ కోరుకున్నట్లు 175 కాదు కదా? 75 సీట్లు కూడా గెలుచుకోలేమన్నారు. ఒకే కుటుంబానికి ఏడు.. మూడు చొప్పున పదవులు ఇచ్చారని.. కష్టపడిన కార్యకర్తల్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. టార్గెట్ 175.. అది కూడా కుప్పం నుంచే షురూ కావాలని తపించే ముఖ్యమంత్రి జగన్ కు.. పార్టీకి చెందిన నేతల అసంత్రప్తి రాగాలు తెలీకపోవటం ఏమిటి? లెక్క ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపించట్లేదు?
Tags:    

Similar News