అమిత్ షాతో అందరి కంటే ముందే... ?

Update: 2021-11-13 05:08 GMT
దేశంలో అత్యంత బలమైన నాయకుడు, మోడీ తరువాత పవర్ ఫుల్ లీడర్ ఎవరూ అంటే హోం మంత్రి అమిత్ షా పేరే చెబుతారు. ఆయనతో అపాయింట్మెంట్ అంటే ఎటువంటి వారికైనా బహు కష్టమే. చాలా సార్లు ముఖ్యమంత్రులకు కూడా అది దక్కదు. అలాంటి అమిత్ షా తానుగా నేరుగా ఏపీకి వస్తున్నారు.

అటువంటి మహా నాయకుడే వస్తే ఆయనతో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపించని వారు ఎవరైనా ఉంటారా. అందునా ఆ మధ్య ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలవాలని ఎంతో కసరత్తు చేసి చివరి నిముషంలో కాలు బెణకడం వల్ల ప్రొగ్రాం క్యాన్సిల్ చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ అయితే ఇపుడు తానే నేరుగా ఎదురేగి తిరుపతి ఎయిర్ పోర్టు లో స్వాగతం పలక బోతున్నారు. అంతే కాదు, ఆయంతో పాటే చాలా సేపు గడపబోతున్నారు.

అమిత్ షాతో కలసి ఆయన శ్రీవారి దర్శనం చేసుకోవడమే కాదు, ఆయన బస చేసిన హొటల్ లోనే కొంత సేపు ఏకాంతంగా భేటీ కాబోతున్నారు. ఆ విధంగా చూస్తే అమిత్ షా ఏపీకి రాకా రాక వస్తే ఫస్ట్ చాన్స్ తానే తీసుకుని అందరి కంటే ముందే జగన్ ఆయనతో సమావేశం కానున్నారు అన్న మాట. ఇక అమిత్ షా తో జగన్ ఏం మాట్లాడుతారు, ఏ విషయాలు చెబుతారు అన్న ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో చాలానే ఉంది.

ఈ మధ్యనే ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. టీడీపీ నేత పట్టాభి జగన్ మీద అసభ్య పదజాలం ఉపయోగించడం, దానికి బదులుగా వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసు మీద దాడి చేయడం, టీడీపీ నేతల బంద్ లు, దీక్షలు, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరడం వంటివి చూసుకుంటే కనుక అమిత్ షా తో జగన్ భేటీకి విశేష ప్రాధాన్యత ఉంది అంటున్నారు.

అదే విధంగా ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, మూడు రాజధానుల విషయం అన్నీ కూడా అమిత్ షా తో చర్చిస్తారు అంటున్నారు. మొత్తానికి అమిత్ షా తో అనేక సమస్యలు చర్చించి వాటిలో కొన్నిటికి పరిష్కారం సాధించుకోవాలని జగన్ చూస్తున్నారు. అదే టైమ్ లో రాజకీయంగా కూడా పై చేయి సాధించడం ద్వారా ఏపీలో విపక్షాలను పూర్వ పక్షం చేయాల‌ని కూడా పక్కా ప్లాన్ తో జగన్ ఉన్నారు. సో అమిత్ షా టూర్ లో చాలా విశేషాలు ఉంటాయని అంటున్నారు.

మరి అమిత్ షా కూడా కేవలం అధికార కార్యక్రమాల కోసమే ఏపీకి వచ్చినా దానితో పాటు రాజకీయ విషయాలను కూడా మాట్లాడకుండా ఉండరు కదా. మరో వైపు బీజేపీ నేతలకు కూడా ఆయన అపాయింట్మెంట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక టీడీపీ నుంచి ఎవరైనా ఆయన్ని కలుస్తారా అన్న చర్చ ఉండనే ఉంది. మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాతో భేటీ అవుతారా అన్నది కూడా చూడాలి అంటున్నారు. మొత్తానికి అమిత్ షా రాకతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయనే భావించాలేమో.
Tags:    

Similar News