కామరాజ్ ఫార్ములాతో జగన్ ...?

Update: 2022-04-20 04:29 GMT
ఏపీలో జగన్ ఎన్నికలకు సిద్ధమైపోతున్నట్లే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు వైసీపీకి ఒక విధంగా పెను సవాల్. ఎందుకంటే అయిదేళ్ళ జగన్ పాలన గీటు రాయిగా జనాలు తీర్పు చెబుతారు. ఏ సెంటిమెంట్లు వర్కౌట్ కాని ఎన్నికలు అవి.  పైగా యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఉంటుంది. దాంతో పాటు అధికారంలో ఉన్న పార్టీ మీద సొంత పార్టీలోనూ అసంతృప్తులు ఉంటాయి. అన్నింటినీ అధిగమించి రెండవసారి అధికారంలోకి వస్తే అది అద్వితీయమే.

ఇక ఏపీలో విపక్షాలు బలంగా ఉన్నాయి. సామాజిక కోణంలో చూసుకుంటే జనసేన గట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. సంస్థాగతంగా టీడీపీ ఈ రోజుకీ పటిష్టంగా ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీని ఓడిస్తాయన్నది  2014లో నిజమైంది. మరో మారు ఆ సెంటిమెంట్ తో ఆ పార్టీలు కలిస్తే ఎదుర్కోవడం వైసీపీకి కష్టసాధ్యమే కాబోతుంది.

అందుకే విపక్షాల కంటే దూకుడుగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. సొంత పార్టీని, ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి తగినట్లుగానే ఎపుడో అరవై ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ పెద్దలు రూపకల్పన చేసిన కామరాజ్ నాడార్ ఫార్ములాను జగన్ ఏపీలో అమలు చేస్తున్నారు.

పార్టీ పనులకు సీనియర్లు, ప్రభుత్వంలో జూనియర్లు ఇలా కొత్త ఫార్ములాతో తాజాదనాన్ని, అనుభవాన్ని మేళవించడం ద్వారా మంచి ఫలితాలు అందుకోవాలని జగన్ చూస్తున్నారు. నిజానికి ఏపీలో తొంబై శాతం మంది మంత్రులను తప్పించాలని జగన్ మొదట్లో అనుకున్నారు. కానీ అది కుదరలేదు. పదకొండు మంది మంత్రులు సామాజిక సమీకరణల వల్ల తిరిగి క్యాబినేట్లోకి రావాల్సి వచ్చింది. దాంతో మిగిలిన పద్నాలుగు మంది మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగించారు.

చాలా మంది సీనియర్లను రీజనల్ కో ఆర్డినేటర్లుగా నియమించారు. అదే విధంగా జిల్లా అధ్యక్షులుగా వారిని తీసుకున్నారు. ఇలా మూడంచెల పార్టీ వ్యవస్థను నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ పార్టీలో విభేదాలు లేకుండా చూడడంతో పాటు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కూడా జగన్ ఆలోచనగా ఉంది.

అందుకే మొత్తం ఏపీలోని 26 జిల్లాలను తొమ్మిది రీజియన్లుగా విభజించి మరీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించారు. జిల్లా ప్రెసిడెంట్లుగా మాజీ మంత్రులకు అవకాశం ఇచ్చారు. అలాగే జిల్లా ఇంచార్జి మంత్రులను నియమించారు. పార్టీ అనుబంధ సంస్థలను యాక్టివ్ చేసే బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు.

ఈ మొత్తం ఆపరేషన్ అంతా కామరాజ్ నాడార్ ఫార్ములాను తలపిస్తోంది. దీని వల్ల 60వ దశకంలో కాంగ్రెస్ బాగానే  లబ్ది పొందింది. అయితే ఇపుడు కాలం మారింది. నాడు ప్రభుత్వంలో ఉండడం కంటే పార్టీ పనులు చూసేందుకే నేతలు అంతా ఇష్టపడేవారు. కానీ ఇపుడు ప్రభుత్వంలో ఉండాలని, అధికారంలో కొనసాగాలని ఆలోచించే పరిస్థితి. అందువల్ల జగన్ అమలు చేస్తున్న ఈ కామరాజ్ నాడార్ ఫార్ముల వైసీపీకి ఏ మేరకు ఉపకరిస్తుంది. దీని వల్ల 2024 ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు అన్నది చూడాలి.
Tags:    

Similar News