ఆంధ్ర‌జ్యోతికి జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే షాక్‌

Update: 2019-10-16 13:29 GMT
ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఆంధ్రజ్యోతి మీడియాకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ జగన్ సర్కార్ తాజా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి బాబుకు ఎంతలా డ‌ప్పు కొట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. చంద్రబాబు బాకా బాగా ఊదినందుకు గాను ఆంధ్రజ్యోతికి విశాఖ పట్టణం నడిబొడ్డున పరదేశి పాలెంలో ఉన్న ఎకరంన్న‌ర‌ భూమిని కేటాయించారు.

చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రజ్యోతి కేటాయించిన భూమి పూర్తిగా అవసరం లేని కేటాయింపు తాజాగా ఏపీ మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇప్పటికే ఆ పత్రికకు అక్కడ అవసరమైన మేర స్థలం ఉన్నా... గత ప్రభుత్వం కేవలం క్విడ్ ప్రోకో కింద భూమి కేటాయించినట్టు పేర్ని నాని వెల్లడించారు. ప్రస్తుతం ఆ స్థ‌లంలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించ‌నుంద‌న‌ గత ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసినట్టు ఆయ‌న తెలిపారు.

నాడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ భూమికి క‌ట్టిన రేటు విలువ చూస్తే షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. ఈ భూమి విలువ 40 కోట్లు కాగా… కారు చౌకగా ఆంధ్ర‌జ్యోతికి నాటి ప్రభుత్వం అప్పగించింది. అర ఎకరం భూమికి కేవలం రూ.5 వేలు, మరో ఎకరం భూమికి రూ.50 లక్షల చొప్పున వెల కట్టి ఆంధ్రజ్యోతి మీడియాకు అప్పగించింది. ఇప్పుడు ఈ భూమిని బ‌ల‌హీన‌వ‌ర్గాల ఇళ్ల‌కు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఆంధ్ర‌జ్యోతి రు.40 కోట్ల విలువైన భూమిని కోల్పోయిన‌ట్ల‌య్యింది.

వైసీపీ అన్నా... జ‌గ‌న్ అన్నా రుస‌రుస‌లాడిపోయే రాధాకృష్ణ‌కు ఇది మామూలు షాక్ కాదు. ఇక చంద్ర‌బాబు ఆనాడు త‌న రాజ‌కీయ శ‌త్రువుల‌పై విష ప్ర‌చారం చేసేందుకు ఆంధ్ర‌జ్యోతిని వాడుకున్న క్ర‌మంలోనే ఆ సంస్థ‌కు ఎన్నో భారీ మేళ్లు చేకూర్చారు. ఈ క్ర‌మంలోనే ఇచ్చిన భూమిని ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది.
Tags:    

Similar News