కేసీఆర్ వ‌ణికి పోతున్నారు: రీజ‌న్ ఇదేన‌ట‌

Update: 2017-10-18 10:10 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి భారీ స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తార‌ని భావిస్తున్న‌వారు ప‌ప్పులో కాలేసిన‌ట్టేన‌ని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఒక్క‌ప్ర‌యోజ‌నాన్నీ ఆయ‌న సాధించ‌లేద‌ని, క‌నీసం ప్ర‌ధాని మోదీ ముందు త‌ల కూడా ఎత్తుకుని నిల‌బ‌డ‌గ‌లిగే రేంజ్ కూడా పోయింద‌ని, ప్ర‌స్తుతం తల‌వంచుకుని పాలిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన జైపాల్ రెడ్డి.. రాష్ట్ర స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు.

అధికారంలో ఉండి అంద‌రికీ ఆద‌ర్శంగా ఉంటార‌ని కేసీఆర్ విష‌యంలో తాను భావించాన‌ని, అయితే, ఆయ‌న అడుగ‌డుగుకీ త‌ప్పులు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ త‌ప్పుల‌ను కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం లెక్క‌పెడుతోంద‌ని అన్నారు. కేసీఆర్ ఏ మాత్రం కేంద్రంపై త‌ల విసిరినా.. నిధులు రావ‌డం లేద‌ని, ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించినా..వెంట‌నే..  చ‌ర్య‌లకు దిగేందుకు - ఈడీ - సీబీఐల‌ను రంగంలోకి దించేందుకు కూడా మోదీ ప్ర‌భుత్వం రెడీగా ఉంద‌ని అన్నారు.  బంగారు తెలంగాణ సాధిస్తార‌ని ప్ర‌తి ఒక్క‌రితోనూ చెబుతున్న టీఆర్ ఎస్ అధినేత‌.. కేంద్రం నుంచి గ్రాంటులు రాకుండా, నిధులు రాకుండా, అప్పులు పుట్ట‌కుండా ఎలా సాధిస్తారో చెప్పాల‌ని నిల‌దీశారు.

త‌న‌ను ప్ర‌శ్నించిన వారిని, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు చేస్తున్న‌వారిని క‌క్ష క‌ట్టి మ‌రీ జైలు పాలు చేస్తున్నార‌ని, అర్ధం ప‌ర్థం లేని కేసుల‌లో ఇరికిస్తున్నార‌ని ప‌రోక్షంగా కోదండ‌రాం ఉదంతాన్ని జైపాల్ లేవ‌నెత్తారు. ఇలానే చేస్తే.. ప్ర‌జ‌లు కేసీఆర్‌ ను - ఆయ‌న కుటుంబాన్ని త్వ‌ర‌లోనే ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. ఇక‌, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్క‌డా బ‌ల‌హీన ప‌డ‌లేద‌ని అన్నారు. కాంగ్రెస్ మ‌హా స‌ముద్ర‌మ‌ని అనేక ఆటుపోట్లు త‌ట్టుకుంద‌ని, కేసీఆర్‌ ను మించిన నేత‌ల‌ను కూడా కాంగ్రెస్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎంతో మందిని చూసింద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే రాజ‌కీయంగా కాంగ్రెస్ మ‌రింత‌గా పుంజుకుంటుంద‌ని జైపాల్ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News