బాబుకు ప‌ట్టిన గ‌తే కేసీఆర్ కు ప‌డుతుంద‌ట‌!

Update: 2018-08-28 10:37 GMT
గ‌డిచిన ఐదారు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరును గ‌మ‌నిస్తున్నారు. ఎవ‌రో త‌రుముతున్న‌ట్లుగా.. ఉన్న‌ట్లుండి ఉలిక్కిప‌డిన‌ట్లుగా వారు పీల‌వుతున్నారు. కేసీఆర్ ను ఏదో ర‌కంగా తిట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేమంటే.. చ‌రిత్ర‌ను గుర్తుకు తెచ్చి మ‌రీ శాప‌నార్థాలు పెడుతున్నారు. ఇలా తిడుతున్న వారంతా మ‌ర్చిపోతున్న అస‌లు పాయింట్ ఏమంటే.. కాంగ్రెస్ నేత‌ల కంటే చ‌రిత్ర మీద ఎక్కువ ప‌ట్టు ఉన్న‌ది కేసీఆర్ కే.

అలాంటి ఆయ‌న్ను చ‌రిత్ర పేరుతో తిట్ట‌టం ఏమైనా స‌బుబా?  తాజాగా ఈ కోవ‌లోకి చేరారు మాజీ కేంద్ర‌మంత్రి.. మేధావిగా అభివ‌ర్ణించే జైపాల్ రెడ్డి. ఇంత‌కీ ఆయ‌న‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమంటే.. కేసీఆర్ ముందుస్తుకు వెళ్ల‌టం ఆయ‌న‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు. కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో కూర్చొని క‌ల‌లు కంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌లు అస‌హ‌నంతో ఉన్నార‌ని.. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే సంతోష‌మేన‌న్నారు. ఒక‌ప్పుడు ముంద‌స్తుకు వెళ్లిన చంద్ర‌బాబుకు ఏ గ‌తి ప‌ట్టిందో అంద‌రికి తెలిసిందేన‌న్నారు. పాల‌న‌పై అసంతృప్తి పెరుగుతుంద‌న్న భ‌యంతోనే కేసీఆర్ ముంద‌స్తు అంటున్నార‌ని విమ‌ర్శించారు.

జైపాల్ మాట‌ల్ని విన్న‌ప్పుడు ఒకింత చిరాకు రావ‌టం ఖాయం. ఎందుకంటే.. ఆయ‌న లాంటి మేధావి సందులో సుబ్బారావు మాదిరి మాట్లాడ‌టాన్ని జీర్ణించుకోగ‌ల‌మా?  జైపాల్ సాబ్ లాంటోళ్లు మాట్లాడితే అందులో ఏదో ఒక పాయింట్ ఉండాలి. మ‌స్తు లాజిక్ ఉండాలి. అలాంటివేమీ లేకుండా నోటికి వ‌చ్చిన‌ట్లు గ‌డ గ‌డ మాట్లాడేస్తే లాభ‌మేంది?

ఇప్పుడు కేసీఆర్  ముంద‌స్తుకు పోతే కాంగ్రెస్ కు లాభ‌మ‌వుతుంద‌నుకున్న‌ప్పుడు.. మ‌రింత రెచ్చ‌గొట్టాలి. బ‌స్తీ మే స‌వాల్ అన్న‌ట్లుగా మాట్లాడాలి. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఉద్దేశం లేనోడికి సైతం ఆ మాట‌లు విన్నంత‌నే.. ఛీ.. ముంద‌స్తుకు పోయి మ‌న స‌త్తా చాటాల‌న్న‌ట్లుగా ఉండాలే కానీ.. అప్పుడెప్పుడో చంద్ర‌బాబు ఇలానే ముంద‌స్తు పోయి నష్ట‌పోయాడు.. నీకు అదే గ‌తి ప‌డుతుంద‌ని చ‌రిత్ర విప్పి చెప్పాల్సిన అవ‌స‌రం ఉందా?  ఆ మాట‌కు వ‌స్తే.. చ‌రిత్ర చెప్పాలంటే అంద‌రి కంటే ఎక్కువ‌గా కేసీఆర్ కు తెలుసు. అంతేనా.. గ్ర‌హ‌బ‌లాల్ని కూడా ఆయ‌న అద‌నంగా చెక్ చేసుకున్నాకే నిర్ణ‌యం తీసుకుంటారు. అలాంటప్పుడు.. అన‌వ‌స‌ర‌మైన మాట‌లు జైపాల్ లాంటి వారి నోటి నుంచి అవ‌స‌ర‌మా?
Tags:    

Similar News