అసలు నిజం చెప్పిన జైరాం

Update: 2016-08-03 12:25 GMT
ఏపీ విభజనకు సంబంధించిన తయారు చేసిన చట్టంలోని లోపాలకు సంబంధించిన పాపం ఎవరి అకౌంట్ లో వేయాలంటే వేరే మాట లేకుండా చెప్పే పేర్లలో టాప్ లో ఉంటుంది మాజీ మంత్రి జైరాం రమేశ్ పేరు. విభజన చట్టాన్ని దగ్గరుండి తయారు చేసిన ఆయన.. తక్కువ కాలంలో అత్యుత్తమంగా తయారు చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారు. విభజన చట్టాన్ని తయారు చేయటం దగ్గర నుంచి ఏపీ విభజనకు సంబంధించి కీలక వ్యవహారాలు ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీవనే చెప్పాలి. విభజన చట్టంలోని లోటుపాట్ల మీద కూడా ఆయనకు అవగాహన ఎక్కువే.

అలాంటి ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసే తొండి వాదనలోని మంచి చెడుల గురించి ఇట్టే చెప్పేయగలరు. మిగిలిన నేతలంతా నోరు ఏసుకొని విరుచుకుపడితే.. జైరాం మాత్రం అందుకు భిన్నంగా పాయింట్లు చెప్పగలరు. అలాంటి ఆయన తాజాగా ఏపీకిప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోదంటూ జైట్లీ చేసిన వాదన తప్పని తేల్చేశారు.

అసలు 14వ ఆర్థిక సంఘానికి.. ఏపీ ప్రత్యేక హోదాకు లింకు పెట్టటంలో అర్థం లేదని ఆయన చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయం 14వ ఆర్థిక సంఘానికి సంబందించిందని జైట్లీ చెప్పటం.. తప్పు దారి పట్టించటమేనని.. ఏపీ ప్రజల్ని మోసం చేసినట్లుగా జైరాం తేల్చి చెబుతున్నారు. మోడీ అనుకోవాలే కానీ.. రేపొద్దున నుంచి ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని.. హోదా ఇవ్వటం ఇష్టం లేకనే తప్పుడు మాటలు చెబుతున్నారంటూ జైరాం ఫైర్ అయ్యారు. ఇన్ని నిజాలు తెలిసిన జైరాం.. తమ అధినేత్రి చేత.. యువరాజు చేత లోక్ సభలో ప్రధాని మోడీ సాక్షిగా అడిగించేస్తే సరిపోతుంది కదా. మీడియా గొట్టాల ముందు బీజేపీ.. టీడీపీల మీద విరుచుకుపడే జైరాం.. ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి సోనియమ్మకు చెప్పి.. ఆమె చేత చెప్పిస్తే సరిపోతుంది కదా. ఆ పని జైరాం లాంటోళ్లు ఎందుకు చేయరో..?
Tags:    

Similar News