జస్ట్.. 13 రోజుల్లో రూ.21వేల కోట్లు వచ్చేశాయ్

Update: 2016-11-24 04:27 GMT
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకూ బ్యాంకుల వైపు కన్నెత్తి చూడని వారు సైతం ఇప్పుడు బ్యాంకుల్లోకి వెళ్లటమే కాదు.. పెద్ద ఎత్తున డబ్బుల్ని దాచి పెట్టుకుంటున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దేశంలోని ప్రతిఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలన్నలక్ష్యంతో ప్రధాని మోడీ తాను పవర్ లోకి వచ్చిన తర్వాత షురూ చేసిన జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి చేరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక భారీ కార్యక్రమంగా.. సామాన్యులకు బ్యాంకు ఖాతాల్ని గతంలో తెరిపించారు. నవంబరు నాటికిదేశ వ్యాప్తంగా 25.5 జన్ ధన్ ఖాతాలున్నాయి. ఈ ఖాతాల్లో కొన్నింటిలో అస్సలు పైసా కూడా డిపాజిట్ కాలేదు. వాటిని మినహాయిస్తే.. మిగిలిన ఖాతాల్లో ప్రధాని రద్దునిర్ణయాన్ని వెలువరించే నాటికి రూ.45.63వేల కోట్ల నిధులు ఉన్నాయి. అలాంటిది ప్రధాని మోడీ రద్దునిర్ణయం వెలువరించిన తర్వాత ఈ జన్ ధన్ ఖాతాల్లోకి భారీగా డిపాజిట్లు వచ్చిచేరటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కేవలం 13 రోజుల వ్యవధిలో ఈ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు డిపాజిట్లుగా మారటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రద్దు నేపథ్యంలో మిగిలిన ఖాతాల్లో రూ.2.5లక్షల మొత్తం వరకూ డిపాజిట్ చేసినా.. దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.కానీ.. జన్ ధన్ ఖాతాల్లో మాత్రం రూ.50వేలకు మించిన డిపాజిట్లు వేస్తే మాత్రం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. రద్దు నిర్ణయం తర్వాత భారీగా నగదు డిపాజిట్ అవుతున్న జన్ ధన్ ఖాతాల్ని పరిశీలిస్తే.. వీటిల్లో పశ్చిమబెంగాల్ మొదటి స్థానంలో నిలిస్తే.. రెండో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రెండురాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పవర్ లో ఉంటే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జన్ ధన్ ఖాతాల్లో వచ్చి చేరిన భారీ డిపాజిట్లపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విచారణ షురూ చేశారు. నిన్నటి వరకూ ఏ మాత్రం పట్టని ఖాతాల్లో ఉన్నట్లుండి వేలాది రూపాయిలు ఎలా పొంగిపొర్లుతున్నట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News