జానారెడ్డి సాబ్ స‌వాలు విసిరారు

Update: 2015-10-19 13:46 GMT
హుందాగా ఉంటూ.. స‌ద్విమ‌ర్శ‌లు మాత్ర‌మే చేయాలంటూ సుద్దులు చెప్పే తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డికి చిరాకు వ‌చ్చేసింది. తన మీద తెలంగాణ అధికార‌ప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. త‌న వైఖ‌రికి భిన్నంగా ఆయ‌న స‌వాళ్లు విసిరారు. తెలంగాణ అధికార‌ప‌క్షం చెబుతున్న‌ట్లుగా రెండేళ్ల‌లో ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టు చేస్తే తాను టీఆర్ ఎస్ పార్టీ గొప్ప‌త‌నాన్ని పొగుడ‌తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. స్వ‌యంగా కేంద్రంరంగంలోకి దిగినా అది పూర్తి చేయ‌టం సాధ్యం కాద‌ని తేల్చేశారు.

టీఆర్ ఎస్ స‌ర్కారు అస‌త్యాలు చెబుతుంద‌న్న ఫైర్ అయిన ఆయ‌న‌.. మంత్రి హ‌రీశ్ రావుకు ఇదే త‌న స‌వాలన్నారు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన మంత్రి కేటీఆర్ పై  కూడా ఆయ‌న మండిప‌డ్డారు. పెద్ద నేత‌ల్ని ఎదిరిస్తున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌ల్లో ఇమేజ్ పెరుగుతుంద‌నుకోవ‌టం భ్ర‌మ అని.. అలాంటి మాట‌లు వారి అహంకారానికి నిద‌ర్శ‌నంగా అభివ‌ర్ణించారు. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌లు తేలుస్తార‌ని చెబుతున్న కేటీఆర్‌.. ఇప్పుడు త‌మ‌ను విమ‌ర్శించ‌టంలో అర్థం ఉందా అని ప్ర‌శ్నించారు. తాగునీటి స‌దుపాయం కోసం మంత్రి కేటీఆర్ చేసిందేమీ లేద‌న్న జానారెడ్డి.. తాను మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో సిరిసిల్ల‌కు కేటాయించిన రూ.50కోట్లు ఇంకా ఖ‌ర్చు చేయ‌లేద‌న్నారు. మాట‌లు మాట్లాడ‌టంతోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావంటూ మంత్రుల‌కు చుర‌క‌లేశారు. విమ‌ర్శ‌ల‌కు దూరంగా.. హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌న్న జానారెడ్డి క‌ల‌ను టీఆర్ ఎస్ నేత‌లు నిజం చేసేలా లేర‌ట్లుందే.
Tags:    

Similar News