జానారెడ్డి ఊగిపోయేలా చేశారే?

Update: 2015-09-30 11:06 GMT
ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ పార్టీకి తిరుగులేని అస్త్రంగా ఉపయోగపడిన భావోద్వేగ వ్యాఖ్యల్ని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. తెలంగాణ ప్రభుత్వం 16 నెలలు గడిచిన తర్వాత కూడా  అదే రాగం తీయటంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఉద్యమ సమయంలో గులాబీ దళం ఏం మాట్లాడినా.. ఎక్కడ సెంటిమెంట్ దెబ్బ తింటుందోనన్న భయంతో ఆచి తూచి వ్యవహరించే వారు.

అయితే.. అలాంటి పరిస్థితి ఎల్లకాలం ఉంటుందని టీఆర్ ఎస్ నేతలు భావిస్తోన్నట్లు కనిపిస్తోంది. దీనికి నిదర్శనంగా ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. రసమయి చేసిన వ్యాఖ్యలతో.. ఎప్పుడూ కూల్ గా ఉండే జానారెడ్డి సాబ్ ను సైతం కోపంతో ఊగిపోయేలా చేశారు.

అధికారపక్షం ఏస్థాయిలో విరుచుకుపడ్డా.. ఆచితూచి స్పందిస్తూ.. తొందరపడకుండా స్వపక్షానికి సర్ది చెప్పే జానారెడ్డి.. రసమయి వ్యాఖ్యలకు మాత్రం తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలోని విపక్షాలు రాష్ట్రం పట్ల సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో జానాసాబ్ కు విపరీతమైన కోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రమనే బిడ్డను ఇచ్చిందని.. ప్రత్యేక రాస్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు.

టీఆర్ ఎస్ పార్టీది మంత్రసాని పాత్ర అంటూ చెలరేగిపోయిన జానారెడ్డి కోపానికి విపక్షాలతో పాటు.. అధికారపక్ష నేతలు సైతం కాస్తంత ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ కారణంతోనే కావొచ్చు.. జానా అగ్రహంతో బాలకిషన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. సెంటిమెంట్ డైలాగులతో ఎదురు దెబ్బలే తప్పవన్న విషయాన్ని రసమయి లాంటి వారికి ఇప్పటికైనా అర్థమైతుందా..?
Tags:    

Similar News