అన్న‌ప్రాస‌న వేళ‌లోనూ రాజ‌కీయ‌మేనా జానా?

Update: 2017-06-08 04:25 GMT
ముఖ్య‌నేత‌ల నోటి నుంచి నిత్యం రాజ‌కీయ వ్యాఖ్య‌లే వ‌స్తుంటాయి. అయితే.. ఇంట్లో శుభ‌కార్యం జురుగుతున్న వేళ‌లోనూ..రాజ‌కీయ వ్యాఖ్య‌లు.. విమ‌ర్శ‌లు చేసేనేత‌లు త‌క్కువ‌మంది ఉంటారు. శుభ‌కార్యం పెట్టుకున్నాం.. అంటూ రెగ్యుల‌ర్ విమ‌ర్శ‌ల‌కు కాసింత విరామం ఇస్తుంటారు.

తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డి మాత్రం దీనికి మిన‌హాయింపు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా ఆయ‌న త‌న మ‌న‌మ‌రాలికి అన్న‌ప్రాస‌న కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి  ల‌క్ష్మి న‌రసింహ‌స్వామి బాలాల‌యంలో స్వామి - అమ్మ‌వార్ల స‌న్నిధిలో అన్న‌ప్రాస‌న చేయించేందుకు జానారెడ్డి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌తో కాసేపు ఆయ‌న మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయిన‌ట్లుగా పేర్కొన్నారు. విభ‌జ‌న నాటికి ఉన్న అప్పులు తాజాగా.. రికార్డు స్థాయిలో రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ట్లుగా పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ స‌ర్కారు ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నార‌న్న జానారెడ్డి మండిప‌డ్డారు. కేసీఆర్ సీఎంగా ఏ మాత్రం అర్హుడు కాద‌న్న ఆయ‌న‌..స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఇంత భారీగా అప్పులు చేయ‌టంపై విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు. కేసీఆర్ స‌ర్కారు తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో వచ్చేది బంగారు తెలంగాణ కాద‌ని.. అప్పుల తెలంగాణ‌గా మార‌టం ఖాయ‌మ‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల వేళ‌లో రైతు రుణ‌మాఫీ కింద వ‌డ్డీని కూడా క‌లిపి ఇస్తాన‌ని చెప్పింద‌ని.. ఇప్పుడేమో ఆ ఊసే ఎత్త‌టం లేద‌ని జానా ఫైర్ అయ్యారు. ఇంట్లో శుభ‌కార్యం పెట్టుకొని కూడా.. ప్ర‌భుత్వాన్ని దుమ్ము దులిపే అవ‌కాశాన్ని జానా మిస్ కాక‌పోవ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కొస‌మెరుపు ఏంటంటే... అంత‌సేపు కేసీఆర్ ని తిట్టిన జానారెడ్డి... అక్క‌డే మ‌రో సంద‌ర్భంలో యాదాద్రి ఆల‌యానికి తెస్తున్న కొత్త సొబ‌గుల‌ను  చూసి ఆనంద‌ప‌డ్డారు. కేసీఆర్ మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని వ్యాఖ్యానించార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News