పాలకొల్లులో జానా మాటలకు చప్పట్లు

Update: 2015-11-02 06:26 GMT
రాష్ట్రాలుగా విడిపోయినా ‘తెలుగు’ వారిగా కలిసి ఉందామన్న అభిలాషను వ్యక్తం ప్రతి ఒక్కరిని తాము అభిమానిస్తామన్న విషయాన్ని సీమాంధ్రులు మరోసారి నిరూపించారు. రాష్ట్రాలుగా విడిపోవటాన్ని వ్యతిరేకించి.. తెలుగువారంతా కలిసి ఉండాలన్న మాటకు తగ్గట్లే విభజన తర్వాత  కూడా ప్రధర్శించటం ఆసక్తికరం. సమైక్య వాదన తమ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ఉందన్న భావన కలిగిస్తూ.. విడిపోయి కలిసి ఉందామన్న మాటకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు సీమాంధ్రులు.

విజయదశమినాడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా అతిధిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటకు కరతాళ ధ్వనులతో పాటు.. ఆయన మాటలు వినేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. శంకుస్థాపన సందర్భంగా వచ్చిన కేసీఆర్ కు తమ ప్రేమాభిమానాల్ని ప్రదర్శించటం పలువుర్ని ఆకట్టుకుంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత.. సీనియర్ రాజకీయ నేత జానారెడ్డికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. సీనియర్ రాజకీయ నేత.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య రాసిన పుస్తకావిష్కరణ సభ పాలకొల్లులో జరిగింది. ఈ కార్యక్రమానికి జానారెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జానారెడ్డి.. మనదంతా తెలుగు కుటుంబం అని అన్నప్పుడు సభలో విపరీత స్పందన లభించింది. కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఈ సందర్భంగా హరి రామజోగయ్యతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించిన జానారెడ్డి.. విభజన అంశాన్ని ప్రస్తావించారు. విభజన అన్నది కొన్ని చారిత్రక కారణాల వల్లజరిగిందని.. దాని గురించి ఆలోచించకుండా రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు పరస్పర అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

పాలకొల్లు.. నరసాపురం ప్రాంతాల్లోని వంతెనల నిర్మాణానికి తాను.. హరిరామజోగయ్య ఇద్దరం కలిసి కృషి చేశామని.. తమ మధ్య అనుబంధం ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి తెలుగు ప్రజలందరిదీ ఒకే కుటుంబమంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించించటం గమనార్హం.
Tags:    

Similar News