మండుతున్న కాపులు...ఆ పార్టీ పోకడల మీదనేనట...?

Update: 2023-02-21 16:00 GMT
ఏపీ రాజకీయాల్లో కాపులు ప్రబలమైన శక్తి. కానీ ఇంతవరకూ వారికి సీఎం సీటు అందని పండు అయింది. అలాగని కాపులలో సామాన్య నాయకులు ఉన్నారా అంటే కానే కాదు, జమా జెట్టీల్లాంటి వారు ఉన్నారు. దిగ్గజ నాయకులు కాపులలో ఉన్నారు. అలాగే వివిధ రంగాలలో కాపులు అగ్ర భాగాన ఉన్నారు. కాపులు తలచుకుంటేనే ఎవరైనా సీఎం సీట్లో కూర్చుంటారు. అలాంటిది కాపులు తమ వారే ఎందుకు ఆ సీట్లో కూర్చోరు అని ఆలోచిస్తున్నారు.

దశాబ్దాలుగా ఒకరికి ఊడిగం చేశాం  ఇక చాలు కాపు నేత ముఖ్యమంత్రి అని ఒట్టేసుకున్నారు. 2024 లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాపు నేత సీఎం కావాల్సిందే అని పంతం పడుతున్నారు. వారికి జనసేన కంటికి కనిపిస్తున్న ఆశాకిరణం. ఏపీ నిండా మెగా అభిమానం పరచుకుని ఉంది. అలాగే ఆ కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి వస్తే మద్దతు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీకి ఎంతో చేశారు. అయితే నాడు అనుకున్న లక్ష్యం సాధించలేకపోయారు. అయితే ఇపుడు విభజన ఏపీలో కాపుల కోరిక తీరుతుందని అంటున్నారు.

దానికి సంబంధించి సామాజికపరంగా ప్రాంతీయంగా, రాజకీయంగా అంతా కలసివస్తున్న పరిస్థితి ఉంది. జనసేనను వచ్చే ఎన్నికల్లో అవుట్ రేట్ గా సపోర్ట్ చేయాలని పవన్ని సీఎం గా చూడాలని కాపులంతా ఆ మధ్యన కలసి తీర్మానం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా చూస్తే జనసేన యాక్టివిటీస్ తగ్గిపోవడం, అదే టైం లో జనసేన పొత్తు రాజకీయాలకు పరిమితం అయ్యేలా కనిపించడంతో కాపులు మండుతున్నారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు, ఇతర పార్టీలను ఏకం చేసి వైసీపీని గద్దె దించాలని జనసేన చూస్తోంది. అయితే ఈ విధంగా చేస్తే అది అంతిమంగా తెలుగుదేశానికే లాభం  చేకూరుస్తుంది తప్ప కాపులకు లాభమేంటి అని కాపులు ఆలోచిస్తున్నారు. రెండు రోజుల క్రితం జగ్గంపేటలో కీలక కాపు నేతలు రహస్య సమావేశం పెట్టి మరీ ఏపీలో కాపు రాజకీయం సాగుతున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు.

కాపుల విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ అందలం దక్కించుకునేందుకు ఒక వంతెనగా ఉంటారని అనుకుంటే ఆయన పొత్తు రాజకీయాలు చేస్తున్నారు అని కొందరు కాపు నేతలు తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారని అంటున్నారు. ఇలా చేస్తే ఒకటో రెండో మంత్రి పదవులు దక్కడం తప్ప కాపులకు రాజ్యాధికారం ఎపుడు లభిస్తుందని కాపు నాయకులు ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.

ఈ తరహా పోకడల పట్ల కూడా చాలా మంది తమ బాధను ఆవేదనను వ్యక్తం చేశారని అంటున్నారు. అదే విధంగా సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సరైన టైం లో టీడీపీలో చేరి ఆ పార్టీని బలోపేతం చేస్తున్నారు అన్నది కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. కన్నా లాంటి వారి వల్లనే కాపులలో అనైక్యత వస్తోందని, దాని ఫలితాలు చేదు అనుభవాలు కాపులు భరిస్తున్నారని, ఇతర పార్టీలు మాత్రం రాజకీయ లాభాలను అందుకుంటున్నారు అని కాపు నేతలు విశ్లేషించుకుంటున్నారుట.

కాపుల విషయంలో ఏమి చేయాలి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఏ రకమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్న దాని మీద మరోసారి కూర్చుని కీలక మైన నిర్ణయాలను తీసుకోవాలని కూడా అంతా తీర్మానించుకున్నారుట. దీన్ని బట్టి చూస్తే కాపులు తమకు సీఎం పదవి దక్కాలన్న దాని మీద ఎంతటి పట్టుదలతో ఉన్నారో ఎంతటి ఆశలు పెట్టుకున్నారో అర్ధమవుతోంది. మరి ఆ దిశగా జనసేనకు గైడెన్స్ ఏమైనా ఇస్తారా లేక తాముగా ఏదైన కొత్త నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే కాపులు మండుతున్నారు. రగులుతున్నారు.

అది తమ సొంత సామాజికవర్గం నాయకుల మీద కూడా ఉండడమే ఇపుడు చిత్రం. ఏపీ రాజకీయాల్లో మూడవ ఫోర్స్ గా ఎదగాలన్న కాపుల ఆకాన్షలను పక్కన పెడుతున్న వారు ఎవరైనా సహించేది లేదు అన్నట్లుగానే కాపుల స్టాండ్ ఉంది అంటున్నారు. తమ వారు పరవారు తేడా లేకుండా కాపుల కోసం పనిచేసే వారికే మద్దతుగా నిలవాలని చూస్తున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News