పవన్ ఆలోచించాల్సిందే : బీజేపీతో చెలిమి వదిలేది కాదు సుమా...?

Update: 2022-07-13 12:30 GMT
ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని ఆ మధ్య తన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గట్టిగా నినదించారు. దానికి ఇపుడు  సరైన సమయం సందర్భాలు కలసి వస్తున్నాయి అనుకోవాలి. పవన్ చెప్పిన సమయానికి ఏపీలో టీడీపీ బీజేపీల మధ్య బంధం పెద్దగా లేదు. పైగా అటూ ఇటూ మాటలు విసురుకుంటున్నారు. ఆ రాంగ్ టైమ్ లో రోడ్ మ్యాప్ ఇవ్వండి అంతా కలసిపోదాం, వైసీపీని గద్దె దించేద్దామని పవన్ కమలం పెద్దలను కోరారు.

అయితే రాజకీయాలు మొత్తం తెలిసిన కాషాయం పెద్దలు దాన్ని లైట్ తీసుకున్నారు. వారికి ఎపుడేమి చేయాలో తెలుసు. ముందు రాష్ట్రపతి ఎన్నికల గండం గడవాలి. దానికి ఏపీలో గంపగుత్తగా ఉన్న వైసీపీ ఓట్లను కొల్లగొట్టాలి. అలా చేయాలీ అంటే టీడీపీ మీద ద్వేషం చూపించాలి. అదే కేంద్ర బీజేపీ పెద్దలు ఇప్పటిదాకా  చేస్తూ వచ్చారు.

ఇక ఈ విషయంలో వైసీపీ ఎంతవరకూ బీజేపీ జాతీయ పెద్దలను నమ్మిందో తెలియదు కానీ చంద్రబాబును ఎప్పటికీ దూరం పెడతారు అనే వైసీపీ వారు ఈ రోజుకీ ఇంకా నమ్ముతున్నట్లుగానే ఉంది. కానీ ఇది ఫక్తు రాజకీయం. ఎపుడు ఏం చేసినా ఎవరికి గురి పెట్టినా అంతిమంగా రాజకీయ ప్రయోజనం కలగాలి. ఇదే కదా కమల నీతి. ఇదే కదా రాజకీయ దమన నీతి.

అందుకే బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ద్రౌపది ముర్ము నామినేషన్ల మీద వైసీపీ మద్దతు సంతకం పడ్డాక ఏపీలో రాజకీయాన్ని రక్తి కట్టించే పనిలో పడింది. భీమవరంలో అల్లూరి 125వ  జయంతి సభకు చంద్రబాబుని ఆహ్వానించడం అందులో తొలి అంకం అయితే తాజాగా ద్రౌపది ముర్ము నోట ఎన్టీయార్ పేరు పలికించడం మరో అంకం. ఇక చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల సమావేశానికి ద్రౌపది ముర్ము అటెండ్ కావడం దానికి పరాకాష్ట.

ఆ మీదట అక్కడ టీడీపీ బీజేపీ నేతలు చెట్టాపట్టాల్ వేసుకోవడం కూడా ఇటీవల కాలంలో జనాలు చూడని ముచ్చట. ఇక ఇది మరింతగా సాగి ఎన్నికల వేళకు కచ్చితంగా ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం దాకా దారి తీస్తుంది అని అంటున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎడముఖం పెట్టి కమలానికి తలాఖ్ అనేస్తారు అన్న వార్తలు అయితే  ఇక మీదట ఆలోచించాల్సిందే అంటున్నారు.

పవన్ సైతం ఇదివరకులా అంత తొందరగా కటీఫ్ ఇచ్చే ఆలోచన చేయరని అంటున్నారు. ఆయనకూ తెలుసు కేంద్రంలో 2024లో మరోమారు ఏదోలా బీజేపీ అధికారంలోకి వస్తుందని, పైగా జాతీయ పార్టీ అండ తనకు ఉండాలని కోరుకునే పొత్తులోకి వచ్చారు. ఇపుడు చూస్తే చంద్రబాబు కమలానికి దగ్గర అవుతున్నారు. ఇవన్నీ పండి కధ పక్వానికి రావడానికి కొంత టైమ్ అయితే పట్టవచ్చు కానీ పొత్తులు అయితే ఎక్కడికీ  పోవు అనే అంటున్నారు.

మొత్తానికి పవన్ ఆవిర్భావ సభలో చేసిన మాటలు రానున్న రోజుల్లో నిజం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన కమలం మీద ఇక పైన ఆచితూచి అన్నట్లుగానే ఉంటారు అని అంటున్నారు. ఆయన బీజేపీతో తెగదెంపులు వంటి కఠిన నిర్ణయానికి కూడా దిగరు అని చెబుతున్నారు.

ఇక పవన్ కి టీడీపీ కావాలి, బీజేపీ కావాలని అంటున్నారు. ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరితే పవన్ కోరుకున్నదే జరుగుతుంది కదా. అందువల్ల ఆయనకు అనవసర ఆయాసాలు ఆవేశాలు ఎందుకు ఉంటాయి అన్న చర్చ అయితే వస్తోంది. సో ముగ్గురు మిత్రులూ మళ్లీ జంబర్దస్తుగా 2024 ఎన్నికలకు రెడీ అయిపోవచ్చు అని అంటున్నారు.
Tags:    

Similar News