సినిమా నుంచి బయటకు రండి పవన్ సార్...?

Update: 2023-06-22 07:00 GMT
సినిమా వేరు, రాజకీయం వేరు అని పదే పదే చెప్పే జనసేనాని పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాల గురించే రాజకీయ సభలలో చెబుతారు. తన సినిమాలకు ముప్పయి కోట్ల నష్టం వచ్చిందని అంటారు. తాను సినిమాల్లో ఫలానా సీన్ చేయలేదంటారు, అలాంటి డైలాగులు మాట్లాడలేదని అంటారు. దీని బట్టి చూస్తే పవన్ తనను తానుగానే సినిమా హీరోగానే పదే పదే చెప్పుకుంటున్నారు అన్న మాట.

అలాగైతే ఆయన్ని జన నాయకుడిగా ఎపుడు గుర్తిస్తారు, ఎందుకు గుర్తిస్తారు అన్నది జనసేనలో అంతర్మధనంగా చెలరేగడం లేదా అన్న చర్చ అయితే ఉంది. పవన్ వారాహి యాత్రలో ఎంతసేపూ మిగిలిన హీరోల అభిమానులు తనకు అండగా నిలబడాలని కోరుకుంటున్నారు. తాను అందరి హీరో అభిమానిని అని అంటున్నారు. తన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొట్టుకోవద్దని సూచించారు.

ఇవన్నీ కూడా ఆయన ఫ్యాన్స్ కి నచ్చుతాయేమో కానీ ఒక రాజకీయ నాయకుడిగా జనంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి సగటు జనాలు ఏమి ఆశిస్తున్నారు, ఆయన ఏమి చెప్పదలచుకున్నారు అన్న ప్రశ్నలకు మాత్రం జవాబు ఉండడంలేదు.

వారాహి యాత్ర మొదలైన దగ్గర నుంచి చూస్తే పవన్ ఎంతసేపూ వైసీపీకి ఎందుకు మెజారిటీ ఇచ్చారు. ఎందుకు గెలిపించారు అన్న ప్రశ్నలు వేయడమే తప్ప తనను ఎందుకు గెలిపించాలో చెప్పుకుంటున్నారా అన్న చర్చ అయితే వస్తోంది.

ఏపీలో సమస్యలు లేవా అంటే బోలెడు ఉన్నాయి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడవచ్చు, ప్రైవేట్ కాబోతున్న స్టీల్ ప్లాంట్ గురించి జనం లో ఉంటూ చెప్పవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ ఎపుడు పూర్తి చేస్తారు అని ఒకేసారి వైసీపీ బీజేపీలని అడిగి కడిగి పారేయవచ్చు విభజన హామీలు నెరవేర్చని కేంద్రాన్ని ఏపీని కూడా కలిపి విమర్శించవచ్చు.

చాలా విశాలమైన రాజకీయ కాన్వాస్ ని ఏర్పాటు చేసుకుని జనం కోసం పవన్ ఏ అంశం అయినా బస్తీ మే సవాల్ అని పోరాడవచ్చు. కానీ ఆయన మాత్రం తన పరిధి ఎందుకో బాగా కుదించేసుకుంటున్నారు. పైన చెప్పిన చాలా సమస్యలను ఎత్తితే బీజేపీకి దూరం అవుతామేమో అన్న ఆలోచన ఉందేమో. అంతే కాదు గత టీడీపీ ప్రభుత్వం తప్పిదాలు కూడా గుర్తుకు వచ్చి జనాల నుంచి ప్రత్యేకించి వైసీపీ నుంచి విమర్శలు వస్తాయన్న ఆలోచనలు కావచ్చు.

ఏది ఏమైనా పవన్ జనసేన రాజకీయ అజెండా చాలా చిన్నదిగా ఉంటోంది. ఆయన విమర్శిస్తే ఎంతసేపూ జగన్ మీదనే అన్నట్లుగా మారిపోయారు. పవన్  పాయింట్ అజెండాతో ముందుకు పోతున్నారు. దీని వల్ల జనాలకు కూడా పవన్ స్పీచ్ లలో కొత్తదనం అయితే కనిపించడంలేదు, అంతే కాదు, ఆయన రాజకీయ నేతలను పట్టుకుని గూండాలు రౌడీలు అనడం మీద కూడా విమర్శలు ఉన్నాయి.

ప్రజలు గెలిపించిన వారిని అలా అనవచ్చా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా తాను సీఎం అని గట్టిగా ఒకసారి చెబితే మరోసారి చెప్పలేని పరిస్థితిలో పవన్ ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కన్ ఫ్యూజన్ తో చేస్తున్న ఈ రాజకీయ యాత్ర ఆయనలోని సినిమా హీరోనే ఎపుడూ బయటకు తెస్తోంది. కానీ ఒక్క విషయం. పవన్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళు దాటుతోంది. ఇంకా తాను సినీ హీరో అంటూ చెప్పుకుంటూ ఉండడం అంటేనే ఆయన రాజకీయ ప్రయాణం ఎక్కడో ఆగిపోయినట్లుగా అనిపించడంలేదూ అన్న డౌట్లు వస్తే మాత్రం తప్పు సేనానిదే సుమా.

Similar News