ఈ మొహమాటాలు పవన్ ఎప్పుడు వదిలేస్తారో?

Update: 2022-04-13 03:06 GMT
ఎదుటోడ్ని అనుసరించే మన తీరు ఉంటుంది. విచక్షణ మరిచి.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారందరికి.. వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా అని మరీ దిగజారి మాట్లాడలేం కదా? అనిపిస్తే.. అలాంటప్పుడు ఎవరికి వారు తమకు తగ్గట్లు కటువుగా సమాధానాల్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మిగిలిన రాజకీయ అధినేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ రాజకీయ పార్టీ అధినేత మీద జరగనంత విష ప్రచారం పవన్ మీద జరిగింది.

ఆయన వ్యక్తిత్వాన్ని తరచూ కించపర్చటం.. ఆయన్ను వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేవారి మాటలకు మీడియాలోనూ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి. ఇక.. సోషల్ మీడియాలో చెప్పాల్సిన అవసరమే లేదు. అదే.. మరే అధినేత విషయంలో ఇలాంటివి ఉంటాయా? అంటే ఉండవనే చెప్పాలి. మిగిలిన అధినేతల విషయంలో ఎవరైనా నోరు పారేసుకుంటే.. దాన్ని హైలెట్ చేసేందుకు.. విమర్శలు చేసిన నేత 'స్థాయి' ఆధారంగా ప్రాధాన్యతను ఫిక్సు చేయటం కనిపిస్తుంది. అదే విధానాన్ని పవన్ విషయంలో మాత్రం కనిపించదు.

మరో రెండేళ్ల తర్వాత జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పొత్తులు ఉంటాయన్న దానిపై క్లారిటీ లేదు. కానీ.. ఇప్పటి నుంచే పవన్ ను తెలుగుదేశం పార్టీ బీ టీంగా.. చంద్రబాబు మానసపుత్రిడిగా అభివర్ణిస్తూ వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలకు మీడియాలో లభించే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇదే తరహా విష ప్రచారం 2014 ఎన్నికల వేళలోనూ.. ఆ తర్వాత జరిగింది కూడా.

పవన్ ను ప్యాకేజ్ స్టార్ అంటూ ముద్ర వేసే విషయంలో వైసీపీ అండ్ కో విజయం సాధించారనే చెప్పాలి. నిజంగానే పవన్ ప్యాకేజీ స్టార్ అయితే.. అందుకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపించింది లేదు. నోటికి వచ్చింది మాట్లాడేయటమే తప్పించి.. తాము చేస్తున్న ఘాటు వ్యాఖ్యలకు.. అంతకు మించిన బలమైన ఆరోపణలకు తగ్గ ఆధారాన్ని చూపించింది లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా అనంతపురం జిల్లా పర్యటన చేస్తున్న పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలు వారి క్యాడర్ చేస్తున్న విష ప్రచారంపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన మాటల కౌంటర్ ను చూసినప్పుడు.. బలంగా ఒక మాట అనేందుకు పవన్ పడుతున్న మొహహాటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలకు లేని మొహమాటం.. మనకెందుకు పవన్? అన్న మాట వినిపిస్తోంది.

పవన్ వ్యాఖ్యల్ని చూస్తే.. "వైసీపీ నేతలు నన్ను టీడీపీ బీ అంటున్నారు. నేను వైసీపీ నేతల్ని చెంచల్ గూడ జైలు షటిల్ టీం అంటాను. జగన్ నన్ను సీబీఎన్ దత్తపుత్రుడన్నారు. జగన్ ను నేను సీబీఐ దత్త పుత్రుడు అంటాను. వైసీపీలో కీలకమైన నేతలను తొందరలోనే సీబీఐ దత్తత తీసుకుంటుంది" అని వ్యాఖ్యానించారు. ఇదే వ్యాఖ్యల్ని మరింత ఘాటుగా చేయొచ్చు. కానీ.. పవన్ మాటల్లో ఆచితూచి తత్త్వం కొట్టొచ్చినట్లుగా కనిపించటం గమనార్హం. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 29 రైతు కుటుంబాలకు లక్ష రూపాయిల చొప్పున చెక్కును అందించిన పవన్ ఈ వ్యాఖ్యల్ని చేశారు. రైతు కష్టాలు తెలిసిన వాడినన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.

ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఆచితూచి మాట్లాడేవారు.. మర్యాదపూర్వక మాటలతో ఏమీ సాధించలేరన్న మాట వినిపిస్తోంది. తనను ఇష్టం వచ్చినట్లుగా అంటూ.. వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి విషయంలో ఎదవ మొహమాటాల్ని వదిలేసి.. అనాలనుకున్న మాటను అనాల్సిన రీతిలో అనేస్తే తప్పించి.. పవర్ ఫైర్ ప్రజల్లోకి వెళ్లదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. పవన్ ఈ సూచనను ఎంతమేర తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News