పవన్ కళ్యాణ్ తడిగుడ్డ వేసుకున్నాడంట!

Update: 2022-09-02 08:32 GMT
ఏపీ పాలిటిక్స్ లో పీకే అనబడే పవన్ కళ్యాణ్ ఏమి చేయగలడు అన్న చర్చ ఎపుడూ ఉంటుంది. ఆయన పార్టీ చూస్తే ఇంకా ఎదగాల్సి ఉంది. పవన్ అయితే ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయడం లేదు అన్న విమర్శలు ఎటూ ఉన్నాయి. ఇక ఆయన రాజకీయాల్లో చూసే సీరియస్ నెస్ పెద్దగా కనిపించదు అని కూడా అంటారు. అలాంటి పవన్ కళ్యాణ్  ఏమీ చేయలేడా. నిజంగా అంతేనా అంటే అసలు  కానే కాదు, పవన్ పవర్ ఫుల్ సినిమా స్టార్. అదే పవన్ కి రాజకీయాల్లోనూ బలమైన సామాజికవర్గం దన్ను ఉంది. మరి ఇన్ని ఉన్న పవన్ ఏమీ చేయలేకపోవడం ఏంటి.

ఆయన తలచుకుంటే ఏమైనా చేయగలడు. తానుగా ఆయన గెలవకపోవచ్చేమో. కానీ ఆయన ఒకరిని ఓడించగలరు, ఒకరిని గెలిపించగలరు, అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఏపీ రాజకీయాల్లో పవన్ ఉంటారన్న మాట. అదే ఇపుడు ప్రధాన రాజకీయ పార్టీలను బెంబేలెత్తితోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని లైట్ గా తీసుకునే పరిస్థితి అయితే ఏపీలో ఎవరికీ లేకపోవచ్చు.

పవన్ కి ఎంత కాదన్నా అయిదు నుంచి ఆరు శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓట్లు చాలా తక్కువగా ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే 2024 ఎన్నికలు ఎంత టైట్ గా సాగుతాయో ఇప్పుడే అందరికీ ఒక అవగాహన ఉండి ఉంటుంది. అధికారాన్ని జగన్ ససేమిరా వదులుకోరు. అదే టైమ్ లో చంద్రబాబు ఎత్తులు పై ఎత్తులు కూడా ఒక రేంజిలో ఉంటాయి.

ఇక 2024కి వచ్చేసరికి వైసీపీకి మీద పూర్తి వ్యతిరేకత ఉండే అవకాశాలు లేవు. అలాగే టీడీపీ మీద పూర్తి అనుకూలత కూడా వస్తుందని ఎవరూ చెప్పలేరు. ఈ నేపధ్యంలో నువ్వా నేనా అంటూ సాగే ఈ ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకమే. అలాంటి నేపధ్యంలో దాదాపుగా నాలుగు కోట్ల ఓట్లున్న ఏపీలో పవన్ జనసేనకు అయిదారు శాతం ఓట్లు అంటే కచ్చితంగా పాతిక  లక్షల ఓట్లు అన్న మాట.

మరి ఇన్ని లక్షల ఓట్లు కనుక పవన్ జేబులో ఉంటే ఆయన ఎవరినైనా గెలిపించగలరు. అలాగే ఓడించనూ గలరు. ఏపీలో టీడీపీ గెలవాలన్నా వైసీపీ ఓడాలన్నా కచ్చితంగా పవన్ హెల్ప్ అవసరమే. అందుకే పవన్ కోసం టీడీపీ చాలానే చేస్తోంది అని అంటున్నారు. మరో వైపు టీడీపీ జనసేన కలవరాదు అని వైసీపీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది.

ఇక ఏపీలో మరోమారు సీఎం సీటు కోసం జగన్ చంద్రబాబు పోటీ పడుతూంటే పవన్ ఫుల్ హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పాలి. ఆయనకు ఏ రకమైన టెన్షన్లు లేవు. ఇంకా చెప్పాలంటే డిసైడింగ్  ఫ్యాక్టర్ గా పవన్ ఉండడంతో ఆయనకు ఏ రకమైన బెంగా బెరుకూ అసలు లేవు. దాంతో అటూ ఇటూ కొట్లాడుకుని చివరికి సీఎం సీటు పవన్ కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. అందుకే చాలా నిదానంగా నింపాదిగా పవన్ ఉన్నారని అంటున్నారు

ఇక ఏపీలో విపక్ష రాజకీయం చేస్తున్న టీడీపీ బీజేపీ ఎవరి మటుకు వారు అన్నట్లుగా ఉన్నా ఎవరు ఎన్ని స్కెచ్ లు గీసుకున్నా పవన్ అన్న ఫ్యాక్టర్ ని వారు ఎప్పటికీ విస్మరించలేరు అని అంటున్నారు. అటు బీజేపీ అయినా ఇటు టీడీపీ అయినా పవన్ దారిలోకి రావాల్సిందే అని కూడా అంటున్నారు. సో పవన్ ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన  అవసరం లేదు, ఆయన దగ్గరనే ప్రధాన పార్టీలు రేపైనా రావాల్సిందే.

అందుకే బే ఫికర్ గా పవన్ ఉన్నారని అంటున్నారు. ఆయనకు ఉన్న స్టామినా ఆయనకే తెలుసు. ఆయన సామాజికవర్గం బలం తెలుసు. సినిమా గ్లామర్ కూడా తెలుసు. అందుకే పవన్ చాలా కూల్ గా ఉన్నారని అంటున్నారు. ఈ రోజు కాకపోయినా మరో రోజు అయినా బీజేపీ టీడీపీ పవన్ని టచ్ చేయాల్సిందే  అని అంటున్నారు. సో పవన్ మార్క్ పాలిటిక్స్ ఇలాగే ఉంటుంది. దటీజ్ పవన్ అనే అంతా అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News