ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. పవన్ రావాల్సిందే..

Update: 2019-05-20 10:22 GMT
ఒకరి బాధ మరొకరికి సంతోషంగా మారింది. పక్కానోడు ఏడుస్తుంటే చూడాలనే క్యూరియాసిటీ కొందరిలో ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్రూరత్వం అంటారో ఇంకేమంటారో తెలియదు. అయితే దాన్ని వారు ఎంజాయ్ చేస్తుంటారు కూడా. ‘స్పైడర్’ మూవీలో చావు ఏడుపు కోసం ఏకంగా విలన్ హత్యలే చేస్తుంటాడు. ఇలా ఏడుపును ఎంజాయ్ చేసే వారు కూడా మన సమాజంలో ఉన్నారు.

పాపం పవన్. ఎంతో నమ్మకంతో సినిమాలన్నీ వదిలి రాజకీయాల్లోకి వచ్చి ఒంటరిగా పోరాడారు. ఎండదెబ్బకు గురైనా.. సెలైన్లు ఎక్కించుకొని చేతికి గ్లూకోజ్ స్టిక్ తో కూడా ప్రచారం చేశారు. కానీ బ్యాడ్ లక్.. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఆయనకు ఒకటి రెండు సీట్లు మాత్రమే వస్తాయని అన్ని సర్వేలు కోడై కూశాయి. రాజకీయంగా విఫలమైనట్టు అంచనాల వేళ.. సరే ఏం చేద్దామని జనసైనికులు, జనసేనానికి నిరాశలో కూరుకుపోయి ఆలోచిస్తున్నారు. కానీ. కొందరు నెటిజన్లు మాత్రం దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం విశేషం.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్క్రీన్ కు తెరపడిందని.. ఇక మళ్లీ సిల్వర్ స్ర్కీన్ కు వచ్చేయాలని అప్పుడే ట్రోలింగ్ లు, వార్తలను సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. పవన్ ను వెండితెరపై మళ్లీ చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ అయ్యి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడని.. అన్నయ్య బాటలోనే పవన్ వెనక్కి రావాలని కోరుతున్నారు.

అయితే గెలిచినా ఓడినా తాను రాజకీయాల్లోనే ఉంటానని.. 2024 నాటికి జనసేనను బలోపేతం చేస్తానని పవన్ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా పవన్ సినిమాల్లోకి వస్తున్నట్టు చేసిన ప్రచారాన్ని ఖండించారు. ఏది ఏమైనా అసెంబ్లీలోకి పవన్ అడుగులు తప్పితే సినిమాల్లోకి పడే అవకాశాలైతే కనిపించడం లేదు. దీంతో నెటిజన్ల కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

    

Tags:    

Similar News