జ‌న‌సేన ప‌రివారం!..పాత సీసాలో పాత సారానే!

Update: 2018-03-22 15:30 GMT
టాలీవుడ్ లో ప‌వ‌ర్ స్టార్‌గా తెలుగు నేల‌లో అశేష అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఎప్పుడేం చేసినా కూడా సంచ‌ల‌న‌మే. ల‌క్ష‌లాదిగా ఉన్న ఆయ‌న అభిమానులు ఆయ‌న‌లాగే వ్య‌వ‌హ‌రించేందుకంటూ ఏకంగా ప‌వ‌నిజ‌మ్ అనే ఓ కొత్త మాట‌ను క‌నిపెట్టేసుకున్నారు కూడా. మొత్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ లో ప‌వ‌న్ స‌రికొత్త రికార్డులు సృష్టించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌దైన ప్ర‌త్యేక‌మైన మేన‌రిజ‌మ్‌తో మెస్మ‌రైజ్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్... సినిమాల్లోనూ ఆటుపోట్ల‌ను చూడ‌క త‌ప్ప‌లేదు. అలాంటిది ఏమాత్రం క‌నీస అవ‌గాహ‌న లేకుండానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎలా స‌క్సెస్ అవుతారు? ఇదే ప్ర‌శ్న చాలా మంది మెద‌ళ్ల‌ను తొలిచేసినా... ఏం చేస్తాడో చూద్దాంలే అన్న వెయిటింగ్‌లోనే జ‌నం ఉండిపోయారు. అయితే ఇప్ప‌టిదాకా పూర్తి స్థాయి రాజ‌కీయాల జోలికే రాని ప‌వ‌న్‌... ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఓ నాలుగు రోజుల పాటు హ‌డావిడి చేసేసి మ‌ళ్లీ అండ‌ర్ గ్రౌండ్ కు వెళ్లిపోతున్నారు. ఇక నాలుగేళ్ల క్రితం ఆయ‌న స్థాపించిన జ‌న‌సేన పార్టీ విష‌యానికి వ‌స్తే.. కార్య‌క‌ర్త‌లు, పార్టీలో ఇత‌ర కీల‌క విభాగాల్లో ప‌నిచేసేందుకు ఇత‌ర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా స‌రికొత్త పంథాను ఎంచుకున్న ప‌వ‌న్ శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను, ఎంపికా శిబిరాల‌ను నిర్వ‌హించారు. ఇత‌ర పార్టీల్లో ప‌నిచేసిన పాత కాపులు త‌న పార్టీలో క‌నిపించ‌ర‌ని, స‌రికొత్త రాజ‌కీయం చేయ‌నున్న త‌న పార్టీలో అంతా కొత్త వాళ్లే ఉంటార‌ని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆది నుంచి చెబుతున్న మాటే.

ఇప్పుడు స‌రిగ్గా అదే మాట‌ను మ‌నం గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పాలి. ఎందుకంటే గ‌డ‌చిన నాలుగు రోజులుగా జ‌న‌సేన ప్ర‌తినిధుల‌మంటూ కొంద‌రు వ్య‌క్తులు తెలుగు నేల‌లో మీడియా ముందుకు ప‌దే ప‌దే వ‌స్తున్నారు. వారిని చూసిన వారంతా వీరా జ‌న‌సేన ప్ర‌తినిధులంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వారితో స‌రికొత్త రాజ‌కీయం ఎలా చేస్తారో ప‌వ‌న్ కే తెలియాలి అన్న మాట కూడా ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. ఇక ఇప్పుడు రంగంలోకి దిగేసిన జ‌న‌సేన ప్ర‌తినిధి బృందంలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు అద్దెప‌ల్లి శ్రీ‌ధ‌ర్‌. ఈ ఒక్క పేరు చూస్తేనే... జ‌న‌సేన కొత్త రాజ‌కీయంపై లేనిపోని డౌట్లు వ‌చ్చేస్తున్నాయి. ఎందుకంటే... అద్దెప‌ల్లి ఇప్ప‌టిదాకా ఎన్ని పార్టీలు మారారో కూడా తెలియ‌దు. అస‌లు ఆయ‌న జ‌న‌సేన‌లో ఎప్పుడు చేరారో, ఎలా చేరారో కూడా తెలియ‌ద‌నే చెప్పాలి. మొన్న‌టిదాకా బీజేపీలో కొన‌సాగిన అద్దెప‌ల్లి... అస‌లు బీజేపీకి రాజీనామా చేసిన త‌ర్వాతే జ‌న‌సేన‌లో చేరారా?  లేదంటే... బీజేపీకి రాజీనామా చేయ‌కుండానే జ‌న‌సేన‌లో చేరారా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

హైద‌రాబాదు కేంద్రంగా ఉండే అద్దెప‌ల్లి... సొంతూరు తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం. ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్పుడు మాత్రమే షెడ్యూల్ కంటే కాస్తంత ముందుగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చేరే అద్దెప‌ల్లి... అక్క‌డ త‌న‌ప ఫ్లెక్సీల‌తో హోరెత్తించ‌డం, ఏ పార్టీలోనైనా టికెట్ దొరుకుతుందేమో చూడ‌టం  లేదంటే తిరిగి హైద‌రాబాదు చేరుతుంటారు. అస‌లు అద్దెప‌ల్లి అంటే ఎవ‌రో కూడా జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌ద‌నే చెప్పాలి. ఏదో పార్టీ పేరు చెప్పి టీవీ చ‌ర్చా వేదిక‌ల్లో పాలుపంచుకున్న స‌మ‌యంలో ఆయ‌న‌ను చూసి... ఆయ‌న పేరు ప‌క్క‌న ఉండే పార్టీని చూసి... ఓహో ఫ‌లానా పార్టీ నేత క‌దా ఈయ‌న అనుకోవ‌డ‌మే మిన‌హా ఆయ‌న గురించి జ‌నాల‌కు అస‌లు ఏమీ తెలియ‌ద‌నే చెప్పాలి. పీఆర్పీ ఆవిర్భావం కంటే ముందు ఏ పార్టీలో ఉన్నారో తెలియ‌దు గానీ... మోగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం స్థాపించ‌గానే అందులో చేరిపోయారు. ఆ పార్టీ త‌ర‌ఫున లైవ్ డీబేట్ల‌లో బాగానే క‌నిపించారు.

ఇక చిరు పార్టీలో గంగలో క‌లిపేసి కాంగ్రెస్ లో చేరిపోతే.. చాలా కాలం పాటు అడ్రెస్ లేకుండా పోయిన అద్దెప‌ల్లి ఆ త‌ర్వాత బీజేపీ ప్ర‌తినిధిగా కొత్త అవ‌తారం ఎత్తారు. టీడీపీ - బీజేపీ మిత్ర‌ప‌క్షాలుగా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ద‌రిమిలా బీజేపీ నేత‌గా త‌న సొంత పార్టీతో పాటు మిత్ర‌ప‌క్షం టీడీపీని కూడా బాగానే వెన‌కేసుకువ‌చ్చిన అద్దెప‌ల్లి... ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, వెంక‌య్యానాయుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుల‌పై ఈగ వాల‌నీయ‌ని విధంగా చ‌ర్చ‌ల్లో మాట్లాడారు. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు క‌నిపించ‌కుండా పోయిన ఆయ‌న‌... ఇప్పుడు హ‌ఠాత్తుగా జ‌న‌సేన ప్ర‌తినిధిగా ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. అంటే... జ‌న‌సేన‌లోనూ అంతా కొత్తోళ్లే ఉండ‌ర‌న్న మాట‌. పాత కాపుల‌కు బాగానే స్థానం ద‌క్కుతుంద‌న్న మాట‌. మ‌రి జ‌న‌సేన‌తో కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తాన‌న్న ప‌వ‌న్ మాట నీటి మూటేనా? ఈ ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ క‌ల్యాణే స‌మాధానం చెప్పాలి మ‌రి.

Tags:    

Similar News