బీజేపీతో జ‌న‌సేన పొత్తు చిత్తే ?

Update: 2021-03-15 16:31 GMT
బీజేపీ - జ‌న‌సేన బంధం మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయేలా క‌నిపిస్తోంది. గ‌తంలో ఆ పార్టీకి స‌పోర్ట్ చేసిన పవ‌న్ బీజేపీకి దేవుడు అయ్యారు. ఆ త‌ర్వాత బీజేపీని వ‌దిలేసి గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిన అనంత‌రం ఇప్పుడు మ‌ళ్లీ బీజేపీతో క‌లిసి న‌డుస్తామ‌ని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ప‌వ‌న్‌ను ఎప్పుడూ మిత్రుడిగా చూడ‌లేద‌నే చెప్పాలి. ప‌వ‌న్‌ను ఓ ఆట‌లో అర‌టి పండు మాదిరిగా చూస్తూ వ‌చ్చింది. ఏపీలో ఓ మోస్తరుగా ప‌వ‌న్‌కు గౌర‌వం ద‌క్కినా తెలంగాణ బీజేపీ నేత‌లు మాత్రం అస‌లు ప‌వ‌న్ అంటే ఎవ‌రు ? అన్న‌ట్టుగా ప‌దే ప‌దే అవ‌మాన‌క‌ర ధోర‌ణిలో మాట్లాడారు. విసిగి విసిగి వేసారిన ప‌వ‌న్ నిన్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రోజే బీజేపీకి షాక్ ఇస్తూ పీవీ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భివాణికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఈ ప్ర‌క‌ట‌న బీజేపీ నేత‌ల గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డేలా చేసిన‌ట్ల‌య్యింది. కేంద్రంతో తాము స‌ర్దుబాటు ధోర‌ణితో ఉన్నా తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వ తీరుతో తాను విసిగిపోయాన‌ని చెప్పారు. అటు పార్టీ అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేష్ సైతం బీజేపీతో పొత్తు ఉండ‌డం వ‌ల్లే జ‌న‌సేన విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అనుకున్న ఫ‌లితాలు సాధించ‌లేద‌ని చెప్పారు. అటు పార్టీ అధినేత తెలంగాణ‌లో బీజేపీని టార్గెట్ చేయ‌డం.. ఇటు జ‌నసేన నాయకులు ఏపీలో బీజేపీని టార్గెట్ చేయ‌డంతో ఈ రెండు పార్టీల బంధం బీట‌లు వారే టైం ద‌గ్గర్లోనే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఏపీలో ప‌లు చోట్ల బీజేపీతో క‌ల‌వ‌డం వ‌ల్ల ఎలా ఓడిపోయామో నివేదిక‌లు రెడీ చేస్తోన్న జ‌న‌సేన నాయ‌కులు వాటిని అధిష్టానం ముందు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో ఆ పార్టీపై ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త ఎఫెక్ట్ త‌మ మీద పడ‌డంతో తాము కూడా అడ్ర‌స్ లేకుండా పోయామ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక పోతిన మ‌హేష్ అయితే క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా తాము ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండ‌డంతో పాటు వారికి ఎంతో సాయం చేశామ‌ని.. ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నా .. బీజేపీపై ఉన్న ప్ర‌జాగ్ర‌హంలో కొట్టుకుపోయామని చెప్పారు.

తాము ఇచ్చే నివేదిక ఆధారంగానే భ‌విష్య‌త్తులోనూ తాము బీజేపీతో పొత్తు విష‌యంలో తీసుకునే నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని మ‌హేష్ చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే తిరుప‌తి ఉప ఎన్నిక‌కు ముందే జ‌న‌సేన బీజేపీకి రాంరాం చెప్పేయ‌బోతోందా ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.




Tags:    

Similar News