చెవిరెడ్డి చిట్టా తవ్విన జనసేన..మరీ ఇంత భారీగానా?

Update: 2023-05-08 10:38 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరు ఉన్న నేతల్లో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ పక్కనే ఉన్న ఆయన.. విపక్షంలో ఉన్న వేళలో నాటి టీడీపీ ప్రభుత్వంలో సర్కారు తీరుపై ఒంటికాలిపై విరుచుకుపడే అతి కొద్ది నేతల్లో చెవిరెడ్డి ఒకరు. జగన్ ప్రభుత్వం ఏర్పడినంతనే మంత్రి పదవి దక్కుతుందని చాలామంది అంచనా కట్టారు. అందుకు భిన్నంగా ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో కాస్తంత ఆచితూచి అన్నట్లుగా చెవిరెడ్డి వ్యవహరిస్తుంటారు.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఆయన ప్రాతినిధ్యం వహించే చోట ప్రజల్లో పట్టుఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదిలాఉంటే.. తాజాగా ఆయన అవినీతి.. ఆయన కుటుంబ అక్రమాలపై చిట్టా విప్పింది జనసేన. ఎమ్మెల్యే చెవిరెడ్డి అవినీతిని సాక్ష్యాలతో తాము ప్రశ్నించాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు జనసేన జిల్లా కార్యదర్శి మనోహర్.. రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి. ఈ సందర్భంగా వారు చెవిరెడ్డికి కొన్ని కీలక ప్రశ్నల్ని సంధించారు.

''2019లో మీ అప్పులెంత..? 2023లో మీ ఆస్తులెంత? మీ కొడుకుల సూట్ కేస్ కంపెనీలకు వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడివి? 2019 ఎన్నికల అఫిడవిట్ లో మీ ఇద్దరు కుమారులను డిపెండెంట్స్ గా చూపించారు.

ఇప్పుడు అదే డిపెండెంట్స్ వేల కోట్ల కంపెనీలు ఎలా స్థాపించారు? రూ.25 లక్షలతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.. ఇన్ని రోజులు యువకులు గుర్తు రాలేదా? ఏం వ్యాపారాలు చేశారు? ఎంత సంపాదించారు? ఎంత ఆదాయ పన్ను కట్టారు?రూ.25 కోట్లతో సంక్రాంతి కానుకలు ఇచ్చారా..? ఇది అవినీతి సొమ్ము కాదా?'' అంటూ ఉక్కిరిబిక్కిరి అయ్యే వ్యాఖ్యలు చేశారు.

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనిచేసిన ఐఎఎస్ అధికారులు అవినీతి ఆరోపణలతో ఇప్పటి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్న జనసేన.. ''అధికారుల అవినీతి బాగోతం కూడా జనసేన పార్టీ లెక్క కడుతుంది. అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు.

తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ వేల కోట్లు విలువైన 22 ఎకరాల మఠం భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తారా? తుడా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? గడప గడపకు తిరగాల్సిన అవసరం లేదు.. ఏదైనా ఒక సెంటర్లో నిలబడి సమస్యలు అడిగితే కుప్పలుతెప్పలుగా వచ్చిపడతాయి'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి.. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Similar News